Fact Check : తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోకి మిడుతలు ప్రవేశించాయా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 May 2020 3:21 AM GMT
Fact Check : తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోకి మిడుతలు ప్రవేశించాయా..?

ప్రస్తుతం భారతదేశానికి ఎడారి మిడుతలు ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే రాజస్థాన్ లాంటి రాష్ట్రాలలోని నగరాల్లోకి మిడుతలు ప్రవేశించాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇవి కనిపించాయి. కొన్ని లక్షల ఎడారి మిడుతలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలలోని 100 జిల్లాల్లో పంటల మీద పడ్డాయి. రాబోయే కొద్ది గంటల్లో మరికొన్ని జిల్లాల్లో ప్రవేశించే అవకాశం ఉందని అంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ఈ మిడుతల దండుపై హై అలర్ట్ ప్రకటించాయి.

ఈ మిడుతలు గుంపులు గుంపులుగా ప్రయాణం చేస్తూ.. దారిలో అడ్డు వచ్చిన ఎన్నో పంటలను తినేస్తూ ఉన్నాయి. ఇవి అన్ని రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తే దేశంలో తినడానికి తిండి కూడా దొరకదు. ఇవి గాలి ఎటువైపు వీస్తే అటు వైపు.. అది కూడా పగటి పూట ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఇప్పటికే కొన్ని లక్షల హెక్టార్లలో పంటలను తినేశాయి.

ఓ వైపు అధికారులు, ప్రజలు తెగ టెన్షన్ పడుతూ ఉంటుంటే కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోకి మిడతలు వచ్చేశాయని.. భోంగిర్ జిల్లా చోటుప్పుల్ లో ఇవి కనిపించాయంటూ ఓ వీడియో తెగ వైరల్ అవుతూ వుంది.

Locusts In Telangana

అదే వీడియోను ఫేస్ బుక్, ట్విట్టర్ లో కూడా షేర్ చేశారు. అనంతపురం జిల్లాలో కూడా ఈ మిడుతలు కనిపించాయంటూ వదంతులను ప్రచారం చేశారు.

నిజమెంత:

మిడుతలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోకి ప్రవేశించాయంటూ వచ్చిన వార్తలు పచ్చి అబద్ధం.

ఈ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా... వీడియో వెరిఫై అవ్వలేదు అని వచ్చింది. అనంతపురం జిల్లాలో మిడుతలు వచ్చాయన్న సమాచారంతో సెర్చ్ చేయగా కోలిఫెరా ఆకుల మీద కొన్ని పురుగులు పడి తినడాన్ని చూడొచ్చు. మహా న్యూస్, సమయం మీడియా సంస్థలు ఈ వార్తలను గతంలో టెలీకాస్ట్ చేశాయి.

డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ-అగ్రికల్చర్ అండ్ కో-ఆపరేషన్ సెక్రెటరీ మాట్లాడుతూ భోంగిర్ లో మిడుతల సంచారం అన్నది పచ్చి అబద్ధమని అన్నారు. సైంటిస్టులు ప్రస్తుతం వీటిపై రీసర్చ్ చేస్తూ ఉన్నారని.. ఇవి స్థానికంగా ఉండే పురుగులు తప్పితే మిడుతలు కాదు అని అన్నారు.

జిహెచ్ఎంసి ఛీఫ్ ఎంటొమోలజిస్ట్ వి.వెంకటేష్ మాట్లాడుతూ తమకు మిడుతలు వచ్చాయంటూ ఎటువంటి రిపోర్టులు రాలేదని అన్నారు. తాము మిడుతల దండును ఎదుర్కోడానికి పక్కా ప్రణాళికతో ఉన్నామని అన్నారు. డ్రోన్ ల ద్వారా స్ప్రే లను జల్లడానికి కూడా రెడీగా ఉన్నామని అన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుత పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. తెలంగాణలో మిడుతలు ప్రవేశించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోడానికి కొందరు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రామగుండంలో ప్రత్యేకంగా ఓ సెంటర్ ను ఏర్పాటు చేసి మిడుతల దండు ప్రయాణంపై నిఘా ఉంచారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో హెలికాఫ్టర్లను ఉపయోగించి మానిటర్ చేయనున్నారు. ఒకవేళ తెలంగాణ లోకి ప్రవేశిస్తే వాటిని ఎలా చంపేయాలన్న దానిపై కూడా ప్రణాళికలు రచించారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో మిడుతల సంచారం అన్నది 'పచ్చి అబద్ధం'

Claim Review:Fact Check : తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోకి మిడుతలు ప్రవేశించాయా..?
Claim Reviewed By:NewsMeter
Claim Fact Check:false
Next Story