ముఖ్యాంశాలు

  • హాజీపూర్‌ హత్యల కేసులో పూర్తి అయిన విచారణ
  • 300 మంది సాక్షుల వాంగ్మూలాలు రికార్డ్‌
  • రెండు నెలల పాటు కొనసాగిన విచారణ

వరంగల్‌: హాజీపూర్‌ హత్యల కేసులో ఇవాళ్టితో విచారణ పూర్తైంది. 300 మంది సాక్షుల వాంగ్మూలాలను ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు రికార్డు చేసింది. ఈ విచారణ రెండు నెలల పాటు సాగింది. హత్యలకు సంబంధించిన ఫోరెన్సిక్‌ రిపోర్టు, సెల్‌టవర్‌ లొకేషన్‌తో పాటు, కీలక ఆధారాలను పోలీసులు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు అందజేశారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. డిసెంబర్‌ చివరి వారంలోగా హజీపూర్‌ వరుస హత్యలపై తుది వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసుపై అక్టోబర్‌ 14 నుంచి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు విచారణ చేపట్టింది. వరుస హత్యల్లో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డి.. ప్రస్తుతం వరంగల్‌ సెంట్రల్‌ జైలులో ఉన్నాడు.

మైనర్ బాలికలు శ్రావణి, కల్పన, మనీషాలను నిందితుడు శ్రీనివాస్‌ రెడ్డి దారుణంగా హతమార్చాడు. 2017లో కర్నూలులో నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదైందని, నిందుతుడిది సైకో మనస్తత్వమని సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో హాజీపూర్‌లోని వ్యవసాయ బావిలో పోలీసులు జరిపిన తవ్వకాల్లో కొన్ని ఎముకలను గుర్తించారు. ఈ ఘటనలు జరిగిన సమయంలో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలోని గ్రామాలు నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని తల్చుకొని వణికిపోయాయి. ఇన్నాళ్లు తమ మధ్యే ఉంటూ ఇంత దారుణాలకు ఒడిగట్టాడని ఆ పల్లె ప్రజలు తెలుసుకోలేకపోయారు. హాజీపూర్‌ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో బస్సులు, ప్రైవేట్‌ వాహనాలు తక్కువగా నడిచేవి. దీన్నే అదనుగా భావించిన శ్రీనివాస్‌రెడ్డి.. లిఫ్ట్‌ పేరుతో అమ్మాయిలను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం, ఆ తర్వాత హత్య చేసేవాడు.

దిశ హత్య ఘటన జరిగిన వారం రోజులకే నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. దీంతో సైక్‌ కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డిని వెంటనే ఉరితీయాలంటూ హాజీపూర్‌ గ్రామంతో పాటు తెలంగాణ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవల హాజీపూర్‌ బాధిత కుటుంబాలు గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ కలిశాయి. దారుణ ఘటనలు వెలుగులోకి వచ్చి ఇంత కాలం గడుస్తున్న నిందితుడికి సరైన శిక్ష వేయడం లేదని, వెంటనే నిందితుడిని ఉరితీయాలని కోరారు. దీనిపై స్పందించిన గవర్నర్‌.. తనకు ఈ విషయం తెలుసని, తాను చేయాల్సిన పనుల్లో ఇది కూడా ఉందని ఆమె పేర్కొన్నారు. మరోవైపు పోలీసులు కీలక ఆధారాలతో నిందితుడికి కఠిన శిక్ష పడేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.