జాన్వీ కపూర్ 'గుంజన్ సక్సేనా' ట్రైలర్.. ఎంతో మందికి ఇన్స్పిరేషన్
By తోట వంశీ కుమార్ Published on 1 Aug 2020 8:28 AM GMTఅతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె 'జాన్వీ కపూర్' నటించిన 'గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్' ట్రైలర్ ఈరోజు విడుదలయ్యింది. ఎంతో మంది మహిళలకు ప్రేరణగా నిలిచిన 'కార్గిల్ గర్ల్ గుంజన్ సక్సేనా' మీద ఈ సినిమాను రూపొందించారు. మహిళ భారత ఎయిర్ ఫోర్స్ లో స్థానం సంపాదించడానికి ఎంత కష్టపడిందో.. మగవాళ్లకు మాత్రమే పైలట్ గా స్థానం అన్న పేరును ఎలా తుడిపేసిందో గుంజన్ సక్సేనా జర్నీని చూస్తే మనకు అర్థమవుతుంది. 'నేను చేయగలను అని అనుకుంటే గౌరవం రాదు.. తల దించుకుని అనుకున్న పనిని చేస్తేస్తేనే గౌరవం లభించగలదు' అన్నది ఈ రియల్ లైఫ్ స్టోరీ గురించి తెలుసుకుంటే అర్థం అయిపోతుంది.
ఓ అమ్మాయి ఎయిర్ ఫోర్స్ లో స్థానం సంపాదించి.. తనకంటూ ఓ గుర్తింపు, గౌరవం సాధించడమే గుంజన్ సక్సేనా ప్రయత్నం. ఆ ప్రయత్నాన్ని ట్రైలర్ లో చూపించారు. భారత ఎయిర్ ఫోర్స్ లో స్థానం సంపాదించాలన్నది గుంజన్ కల.. ఆ కల సాకారం చేసుకోడానికి ఓ మహిళ ఎలా పోరాడిందన్నది ఈ ట్రైలర్ లో చూపించారు. మహిళ అయిన పురుషుడైనా పైలట్ ను పైలట్ అనే అంటారనే డైలాగ్ అందరినీ ఆలోచింపజేస్తుంది.
పంకజ్ త్రిపాఠి జాన్వీ కపూర్ తండ్రి పాత్రలో కనిపించాడు. తన కూతురు ఎగరాలి అనుకుంటున్న కలలను ఆయన సాకారం చేయడానికి చేసే ప్రయత్నం చూడొచ్చు. కష్టపడితే ఎప్పటికైనా విజయం సాధించవచ్చనే విషయాన్ని తన కూతురికి నూరిపోసి.. ఆమెను భారత ఎయిర్ ఫోర్స్ లో స్థానం సంపాదించేలా చేస్తాడు. ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అయ్యాక ఆమె ఎదుర్కొన్న లింగ వివక్షను కూడా ట్రైలర్ లో చూపించారు. ఆ తర్వాత బెస్ట్ పైలట్ గా కార్గిల్ వార్ లో ఆమె చేసిన సాహసం గురించి కూడా చిన్నపాటి గ్లిమ్ప్స్ ను ట్రైలర్ లో చూడొచ్చు. ఈ సినిమా ఆగస్టు 12న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతోంది.
ఫ్లైట్ లెఫ్టినెంట్ గుంజన్ సక్సేనా జీవిత చరిత్ర మీద ఈ సినిమాను తెరకెక్కించారు. చీతా హెలీకాఫ్టర్ లో కార్గిల్ యుద్ధంలో ఎంతో సాహసోపేతంగా పోరాడే ఘట్టం సినిమాలో హైలైట్ గా మారబోతోందని చెబుతున్నారు. శరణ్ శర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అంగద్ బేడి, వినీత్ కుమార్, మానవ్ విజ్, అయేషా రజా ముఖ్య పాత్రలు పోషించారు.