మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ కన్నుమూత

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Oct 2020 10:20 AM GMT
మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ కన్నుమూత

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ శాసనసభా పక్ష మాజీ నేత గుండా మల్లేష్ కొద్దిసేప‌టి క్రితం క‌న్నుమూశారు.‌ తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయ‌న ఈ రోజు తుదిశ్వాస విడిచారు. కరోనా, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులకు సంబంధించి ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.

గుండా మరణంతో బెల్లంప‌ల్లి, మంచిర్యాల‌లో విషాద చాయ‌లు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు, కార్యకర్తలు శోక‌సంద్రంలో మునిగిపోయారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మ‌ల్లేష్ మాంచి మాస్ లీడ‌ర్‌. 1983లో ఆసిఫాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించిన ఆయ‌న‌.. అనంత‌రం 1985, 1994 ఎన్నికల్లోనూ విజ‌యం సాధించారు. 2009లో బెల్లంపల్లి నుంచి ఎన్నికై శాసనసభా పక్ష నేత‌గా కూడా వ్యవహరించారు.

గుండా మల్లేశ్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. నాలుగుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన మల్లేశ్ తో తనకున్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. మల్లేశ్ కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Next Story