జిమ్ లు ఓపెన్ అవుతున్నాయి కదా.. ఇవి పాటించాల్సిందే..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Aug 2020 10:11 AM GMTఅన్ లాక్ 3.0 లో భాగంగా జిమ్ లు ఆగష్టు 5 నుండి ఓపెన్ చేస్తూ ఉన్నారు. సామాజిక దూరం పాటించేలా, కరోనా వ్యాప్తి జరగకుండా జిమ్ ఓనర్లు అన్ని ఏర్పాట్లు చేయనున్నారు. సరికొత్త మార్గదర్శకాలను పాటించాల్సి ఉంది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్.ఓ.పి.), సామాజిక దూరం, కోవిద్-19 వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ జిమ్ ఓనర్లకు సూచనలను జారీ చేసింది. వీటిని ఖచ్చితంగా పాటించాల్సిందేనని చెబుతున్నారు.
హైదరాబాద్ నగరంలోని జిమ్ ఓనర్లు కూడా కరోనా వ్యాప్తి జరగకుండా జిమ్ లలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. బంజారాహిల్స్ లోని జిమ్ ఓనర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ 'ఎక్కువ మంది క్లయింట్ లను జిమ్ లోకి అనుమతించము.. ఎక్కువ సంఖ్యలో జిమ్ మెంబర్స్ ఉంటే వారికి ఒక్కో టైమింగ్ లో జిమ్ లోకి అనుమతి ఇస్తాము. కొందరిని ఉదయం.. మరికొందరిని సాయంత్రం సమయంలో జిమ్ లోకి వచ్చేలా టైమ్ టేబుల్ అన్నది రూపొందించనున్నాము. గ్రూప్ వర్కౌట్ అన్నదే లేకుండా చేశాము. గ్లవ్స్ ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సిందే.. వారి వారి శానిటైజర్లు తెచ్చుకోవాలని కూడా సూచిస్తూ ఉన్నాము. పెద్ద పెద్ద వెయిట్స్ ను ఎత్తే సమయంలో జిమ్ ట్రైనర్లు తాకకుండా ఉండేలా కూడా సూచించామని' తెలిపారు.
జిమ్ లోకి వచ్చే సభ్యులు కూడా తగినన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని జిమ్ ఓనర్లు చెబుతున్నారు. సామాజిక దూరాన్ని పాటించని జిమ్ సభ్యులను తక్షణమే జిమ్ నుండి వెళ్లిపోయేలా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. జిమ్ లోకి తీసుకుని వచ్చే వస్తువులను శానిటైజ్ చేయించాలని సూచించారు. స్టీమ్ బాత్, పోస్ట్ వర్కౌట్ స్ట్రెచ్ లాంటి సర్వీసులు అందుబాటులో ఉండవని జిమ్ ఓనర్లు తెలిపారు.
ఛేంజ్ రూమ్స్, వాష్ రూమ్స్ వంటివి ప్రస్తుతానికైతే అందుబాటులో ఉండవని.. నో కాంటాక్ట్ పాలసీని అమలు చేయనున్నామని తెలిపారు. కనీసం షేక్ హ్యాండ్స్ వంటివి కూడా కూడా ఉండవని, చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జిమ్ లకు వెళ్ళడానికి ఎంత మంది ముందుకు వస్తారో చూడాలి. చాలా మంది బయటకు వెళ్ళడానికే భయపడుతూ ఉంటుంటే.. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జిమ్ లకు పెద్ద సంఖ్యలో క్లయింట్స్ వెళతారా.. లేదా అన్నది వేచి చూడాల్సిన పరిణామమే..!