మంచు విష్ణు స్కూళ్ల‌లో జీఎస్టీ అధికారుల త‌నిఖీలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Dec 2019 3:40 PM GMT
మంచు విష్ణు స్కూళ్ల‌లో జీఎస్టీ అధికారుల త‌నిఖీలు

హైద‌రాబాద్ కేంద్రంగా నేడు జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఆధ్వ‌ర్యంలో అధికారులు ప‌లు పాఠ‌శాల‌లు, చిట్‌పండ్ కంపెనీలు, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపార‌స్తుల సంస్థ‌లు, కార్యాల‌యాల‌లో సోదాలు నిర్వ‌హించారు. ఈ రోజు ఉద‌యం నుండి మొద‌లైన ఈ సోదాలు ఇంకా కొన‌సాగుతున్నాయి. మేడ్చల్, మల్కాజ్‌గిరి, ఖైరతాబాద్, బంజారా హిల్స్, బేగంపేట, లింగంపల్లిలోని 20 చోట్ల అధికారులు ఏక‌కాలంలో ఈ తనిఖీలు చేప‌ట్టారు.

ఈ సోదాల‌లో టాలీవుడ్ హీరో మంచు విష్ణుకు సంబందించిన స్ర్పింగ్ బోర్డ్ అకాడమీ, చిరెక్ స్కూల్ లు కూడా ఉన్నాయి. మంచు విష్ణు బోర్డు చైర్మ‌న్‌గా ఉన్న స్ప్రింగ్ బోర్డ్ అకాడ‌మీలో ప‌న్ను ఎగ‌వేత‌కు సంబందించి అధికారులు సోదాలు నిర్వ‌హించారు. 2017వ సంవ‌త్స‌రం జీఎస్టీకి ముందు.. జీఎస్టీకి త‌ర్వాత ప‌న్ను ఎగ‌వేత‌, లావాదేవీల‌కు సంబందించి ప‌లు సంస్థ‌ల‌లో సోదాలు నిర్వ‌హించారు. ఈ సోదాల‌లో వేరు వేరు ప్రాంతాల‌లో రూ. 40 కోట్ల‌కు పైగా ప‌న్నులు చెల్లించాల్సి ఉన్న‌ట్లు గుర్తించిన‌ట్లు జీఎస్టీ అధికారి ఒక‌రు అన్నారు.

అధికారి మాట్లాడుతూ.. కొన్ని ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూళ్లు, బిల్డర్లు, కాంట్రాక్ట‌ర్లు స‌ర్వీస్ టాక్స్ చెల్లించకుండానే.. జీఎస్టీ ప‌రిధిలోకి చేరారు. జీఎస్టీ ప‌రిధిలోకి చేరాము కాబ‌ట్టి మేము ప‌న్ను ఎగ‌వేత దారుల లిస్టులోకి రామ‌ని కొన్ని సంస్థ‌లు అనుకుంటున్నాయ‌ని.. అటువంటి సంస్థ‌ల‌ను ఈ సోదాల‌లో చాలా గుర్తించామ‌ని ఆయ‌న అన్నారు. ఈ సోదాల‌లో ప‌న్నువేత‌కు సంబందించి కొన్ని కీల‌క ప‌త్రాలు స్వాధీనం చేసుకున్నామ‌ని తెలిపారు. ఈ సోదాలు మ‌రో రెండు రోజుల పాటు కొన‌సాగుతాయ‌ని ఆ అధికారి తెలిపారు.

Next Story