అన్‌లాక్ 4.0: బార్లు, పబ్‌లకు గ్రీన్ సిగ్నల్
By సుభాష్ Published on 1 Sept 2020 12:23 PM ISTవీకెండ్ వచ్చిందంటే చాలు.. డీజే స్టెప్పులతో సందడి సందడిగా ఉండే పబ్‌లు, బార్లు కరోనా మహమ్మారి కారణంగా మూతపడ్డాయి. ఇప్పటిరకు దాదాపు అన్ని రంగాలు తెరుచుకోగా, కొన్ని రంగాలు మాత్రమే ఇంకా మూతపడే ఉన్నాయి. ఇక సెప్టెంబర్ 1 నుంచి దేశ వ్యాప్తంగా అన్‌లాక్ 4.0 అమల్లోకి వచ్చింది. అయితే ఈ అన్‌లాక్‌లో పబ్, క్లబ్, బార్లకు అనుమతించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల్లో భాగంగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పబ్‌లు, బార్లు, క్లబ్‌లకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అన్‌లాక్4.0 మార్గదర్శకాలకు అనుగుణంగా పబ్‌లు, బార్లు, క్లబ్బులను తెరిచేందుకు కర్ణాటక ఎక్సైజ్‌శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బార్లు, క్లబ్, పబ్బుల్లో మద్యం విక్రయాలను అనుమతిస్తామని పేర్కొంది. కానీ కొన్ని నిబంధనలు విధించింది. సీటింగ్ సామర్థ్యంలో సంగం ఖాళీగా ఉండాలని ఎక్సైజ్ శాఖ మంత్రి హెచ్ నాగేష్ సూచించారు. కోవిడ్ నేపథ్యంలో 50శాతం మాత్రమే సీటింగ్ ఉండాలని, అలాగే ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని తెలిపారు. కరోనా ప్రభావంతో మద్యం అమ్మకాలు నిలిచిపోవడంతో ఆదాయం పెంచుకునేందుకు ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. కాగా, ప్రభుత్వానికి ఇప్పటి వరకూ రూ.1435 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. గత సంవత్సరం ఇదే సమయంలో ప్రభుత్వానికి వచ్చిన రాబడితో పోల్చితే ఇప్పుడు భారీగా నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.