క‌ర్నూలును రాజ‌ధానిగా ప్ర‌క‌టించండి.. లేదంటే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Dec 2019 4:39 PM GMT
క‌ర్నూలును రాజ‌ధానిగా ప్ర‌క‌టించండి.. లేదంటే..!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల నిర్ణయంపై మ‌రింత ఇర‌కాటంలో ప‌డ‌నున్నారా? అంటే అవున‌నే అంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు. అస‌లే రైతుల ఉద్య‌మంతో అయోమ‌యంలో ఉన్న స‌ర్కార్‌కు తాజాగా గ్రేటర్ రాయలసీమ డిమాండ్ మ‌ళ్లీ తెర‌మీద‌కి రావ‌డంతో ఈ త‌ర‌హా ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అనుకుంటున్న విశాఖ‌ప‌ట్నం రాయలసీమకు వంద‌ల కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉండ‌టంతో.. తాజాగా కర్నూలును రాజధానిగా ప్రకటించాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఈ మేరకు గ్రేటర్ రాయలసీమ వేదిక తరఫున నేత‌లు ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు.

కర్నూలులో హైకోర్టు ఏర్పాటుతో ఒరిగేదేమీ లేదని.. అడ్మినిస్ట్రేటివ్ రాజధాని ఇక్కడ ఏర్పాటు చేయాలని గ్రేటర్ రాయలసీమ నేతలు డిమాండ్ చేస్తున్నారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలులోనే రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ మేర‌కు మాజీ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, హైకోర్టు న్యాయవాదులు సహా రాయలసీమ ప్ర‌ముఖులు బుధవారం సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాశారు.

ఈ లేఖపై మాజీ హోంమంత్రి ఎంవి మైసురారెడ్డి, మాజీ ఎంపి గంగుల‌ ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రెడ్డి, మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, ఆర్టీఐ కమీషనర్ డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్, హైకోర్ట్ న్యాయవాదులు సీ శివప్రసాద రావు, డి సుధాకర్ రెడ్డి ఇతరులు సంత‌కాలు చేసి జీఎం జ‌గ‌న్‌కు పంపారు.

ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి మైసూరా రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రం కోసం రాజధానిని సీమ ప్రజలు త్యాగం చేశారని.. ఇప్పుడైనా సీమకు న్యాయం చేయాలని అన్నారు. హైకోర్టు ఏర్పాటుతో రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధికి ఆస్కారం లేద‌ని అన్నారు. అలాగే కర్నూలును ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లేదా లెజిస్లేచర్ క్యాపిటల్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

అంతేకాకుండా.. రాయలసీమ రాజధాని ఏర్పాటు చేయాల్సిందేనని.. లేకుంటే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. రాజధాని ఇవ్వకపోతే రాష్ట్రమైనా ఇవ్వాలని ఆయన సూచించారు. రాయలసీమకు మరోసారి అన్యాయం జరిగితే సహించేది లేదని హెచ్చ‌రించారు.

Next Story