ఢిల్లీ: మరో రెండు వారాలు లాక్‌డౌన్‌ పొడిగింపు..?

By సుభాష్  Published on  27 May 2020 1:05 PM GMT
ఢిల్లీ: మరో రెండు వారాలు లాక్‌డౌన్‌ పొడిగింపు..?

ముఖ్యాంశాలు

  • దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు

  • మరి కొన్ని సడలింపులుతో లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశం

  • లాక్‌డౌన్‌ పొడిగింపునకే మొగ్గు చూపుతున్న కేంద్రం?

భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగిపోతున్నాయి. ఇక దేశంలో కరోనా కేసుల్లో మొదటిస్థానంలో మహారాష్ట్ర ఉంది. అక్కడ మంగళవారం ఒక్క రోజే 2,091 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 97 మంది మృతి చెందారు. ఇలా మహారాష్ట్ర తర్వాత తమిళనాడు, గుజరాత్‌ ఇలా దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఇక కేంద్ర విధించిన లాక్‌డౌన్‌ 4.0 మే 31వ తేదీతో ముగియనుంది. అలాగే నాలుగో దశ లాక్‌డౌన్‌లో కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది. అయితే దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో లాక్‌డౌన్‌ 5లో కూడా మరికొన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే లాక్‌డౌన్‌ సడలింపుల్లో ఆలయాలు, ప్రార్థనా మందిరాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వలని కర్ణాకట కేంద్రాన్ని కోరింది. అందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యంపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, రాష్ట్రాల అంగీకారంతో అంతరాష్ట్ర రవాణా కొనసాగించుకోవచ్చని గతంలో కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల్లో తెలిపింది.

ఇక భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్షన్నరకు చేరుకుంది. అయితే ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్‌, కోల్‌కతా, పుణే, జైపూర్‌, సూరత్‌, ఇండోర్‌లో కరోనా కేసులు కలిపితే దేశంలో 70 శాతం వరకూ ఉన్నాయి. గత 14 రోజుల్లోనే కేసుల సంఖ్య రెండింతలైంది. ఇప్పటి వరకూ కరోనా మరణాలు 4337 ఉండగా, గత 15 రోజుల్లోనే మరణాల రేటు చాలా పెరిగింది.

ఇక తాజాగా గడిచిన 24 గంటల్లో 6387 కరోనా కేసులు నమోదు కాగా, 170 మంది మృతి చెందారు. భారత్‌లో ఇప్పటి వరకూ 1,51,767 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకూ 4337 మంది మృతి చెందారు. మొత్తం నమోదైన కరోనా కేసుల్లో 64,426 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో 54,758 కేసులు నమోదు కాగా, 1792 మంది కరోనా కాటుకు బలయ్యారు.

Next Story