తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సాహసం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Jun 2020 4:46 PM IST
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సాహసం

మాయదారి రోగం విరుచుకుపడిన తర్వాత అవసరం ఉన్నా ఆసుపత్రికి వెళ్లనోళ్లు చాలామందే కనిపిస్తారు. అంతదాకా ఎందుకు? తెలిసిన డాక్టర్ కు ఫోన్ చేసి.. సార్.. ఆసుపత్రికి వస్తామని అడిగితే.. ఇప్పుడెందుకు? అన్న మాట పలువురి నోటి నుంచి వస్తోంది. ఇక.. ఆసుపత్రులు కవర్ చేసే రిపోర్టర్ల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. మా మాట వినండి.. మీరెవరూ ఆసుపత్రులకు రావొద్దు. ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే ఫోన్ చేయండి.. అనవసరంగా రిస్కు తీసుకోవద్దని మీడియా మిత్రుల్ని హెచ్చరిస్తున్న వైద్యులు బోలెడంతమంది.

రిపోర్టింగ్ హడావుడిలో పడి.. అపాయంలో చిక్కుకోవద్దని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. తాము ఎంతో జాగ్రత్తగా ఉంటున్నామని.. తమకే మాయదారి రోగం ముప్పు ఉన్నప్పుడు.. మీ పరిస్థితి గురించి కాస్త ఆలోచించుకోవాలన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వీవీఐపీ ఒక నిమ్స్ లాంటి ఆసుపత్రిని సందర్శించటమంటే మాటలా? అలాంటి సాహసానికి తెర తీశారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై.

ఇటీవల నిమ్స్ లో నలుగురు ప్రొఫెసర్లు.. ఎనిమిది మంది రెసిడెంట్ వైద్యులు.. ఎనిమిది మంది పారామెడికల్ సిబ్బంది మాయదారి మహమ్మారి బారిన పడ్డారు. ఇలాంటివేళ.. నిమ్స్ ను సందర్శించి.. ఇక్కడ జరుగుతున్న వైద్యం ఎలా ఉంటుందన్న ఆరా తీశారు గవర్నర్. రానున్న కొద్దిరోజుల్లో నిమ్స్ ను వైద్యులకు.. కొన్ని రంగాల ప్రముఖులకు మాయదారి రోగానికి చికిత్స అందించేందుకు వీలుగా సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాన్యులే ఆసుపత్రులకు వెళ్లేందుకు వెనుకా ముందు ఆడుతున్న వేళ.. అందుకు భిన్నంగా గవర్నర్ లాంటి వీవీఐపీ ఆసుపత్రిని సందర్శించటం.. అక్కడి పరిస్థితుల్ని ఆరా తీయటం అంటే.. పెద్ద సాహసం కిందే లెక్క.

Next Story