ఇలాంటి పలుకరింపులు హరీశ్ కు మాత్రమే సాధ్యమేమో?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Jun 2020 4:11 AM GMT
ఇలాంటి పలుకరింపులు హరీశ్ కు మాత్రమే సాధ్యమేమో?

తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే ఉండదు. ఎలాంటి కాలంలో అయినా సరే.. ప్రజల మధ్యన ఉండేందుకే ఆయన చూపించే మక్కువ అంతా ఇంతా కాదు. మామూలు రోజుల్లో తక్కువలో తక్కువ రోజుకు వంద..రెండు వందల కిలోమీటర్లు కారులో ట్రావెల్ చేస్తారని చెబుతారు. ఇక.. ఆదివారం అయితే అది కాస్తా నాలుగైదు వందల కిలోమీటర్లను కూడా దాటేస్తుందని చెబుతారు. తన నియోజకవర్గాన్ని తరచూ పూర్తిగా కవర్ చేయటమే కాదు.. ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా పట్టించుకుంటారని చెబుతారు.

మిగిలిన నేతలకు భిన్నంగా ఆదివారం.. సెలవు రోజుల్లో ఉదయాన్నే బయటకు వచ్చేసే హరీశ్.. రాత్రికి కానీ ఇంటికి చేరుకోరని చెబుతారు. మాయదారి రోగం మొత్తంగా కమ్మేస్తున్న వేళలోనూ ఇంటి పట్టున ఉండకుండా తిరుగుతున్న వైనం ఆసక్తికరం. కాకుంటే గతంలో మాదిరి కాకుండా.. కారు దిగకుండానే ఆయన తన పర్యటల్ని పెట్టుకుంటున్నారు. కారులో ఉండి మాట్లాడే హరీశ్.. భౌతికదూరాన్ని తప్పనిసరిగా పాటిస్తుంటారు.

తాజాగా సిద్దిపేట పట్టణంలో ఉదయాన్నేబయటకు వచ్చిన ఆయన.. వీధుల్లో పర్యటిస్తూ.. దారిలో కనిపించిన మహిళలతో ముచ్చటించారు. వారి కష్టసుఖాల గురించి ఆరా తీస్తూ.. చేతిలో ఉన్న సంచుల్ని చూస్తూ.. ఆదివారం కదా స్పెషల్ ఏంటి? ఏం తెచ్చుకున్నారమ్మా? మటనా? చికెనా? అంటూ సరదాగా ప్రశ్నించారు. హరీశ్ మాటలకు మహిళలు ఆనందానికి గురయ్యారు. హరీశ్ లాంటి పెద్ద నేత తమ కుటుంబ సభ్యుడిలా మాట్లాడటంతో వారు పొంగిపోతూ ఆయన అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. సరదాగా ప్రశ్న వేయటమే కాదు..చికెన్.. మటన్ తెచ్చుకోవటానికి ప్లాస్టిక్ సంచుల్ని వాడొద్దని.. స్టీల్ డబ్బాల్ని వినియోగించటం మర్చిపోవద్దని కోరారు. ఇలా.. ప్రజలతో మమేకమవుతూ.. సరదాగా మాట్లాడటం.. వారి సమస్యల్ని తెలుసుకోవటం లాంటివి హరీశ్ కు మాత్రమే సాధ్యమని చెప్పక తప్పదు.

Next Story