ఐటీ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్..
By తోట వంశీ కుమార్ Published on 22 July 2020 12:43 PM ISTదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రికార్డు సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోంకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ప్రమ్ హోమ్ చేయిస్తున్నాయి. ఐటీ, బీపీవోలతో సహా అవకాశం ఉన్న పలు వాణిజ్య సంస్దలు ఇదే పద్దతిని ఫాలో అవుతున్నాయి.
అయితే.. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరోసారి ఐటీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఐటీ, బీపీవో కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని డిసెంబర్ 31 వరకు పొడిగించింది. దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గకపోవడంతో కేంద్ర ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని పొడిగించింది. గతంలో ప్రకటించిన వర్క్ ఫ్రమ్ హోమ్ గడువు జులై 31తో ముగుస్తుంది.
కరోనా కారణంగా ప్రజల్లో నెలకొన్న భయాందోళనను దృష్టిలో ఉంచుకుని ఇంటి నుంచి పనిచేసే విధానాన్ని డిసెంబర్ 31, 2020 వరకు పొడిగిస్తూ సర్వీసు ప్రొవైడర్లకు నిబంధనలు, షరతులతో డాట్ సడలింపులు ఇచ్చిందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ట్వీట్ చేసింది. భారత్‌లో ప్రస్తుతం 85 శాతం ఐటీ ఉద్యోగులు ప్రస్తుతం ఇంటి నుంచే పని చేస్తున్నారు.