ఐటీ ఉద్యోగులపై ఇప్పటికే వేటు.. రానున్న రోజుల్లో మరెంతమందికంటే?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 July 2020 6:44 AM GMT
ఐటీ ఉద్యోగులపై ఇప్పటికే వేటు.. రానున్న రోజుల్లో మరెంతమందికంటే?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా దెబ్బకు అన్ని రంగాలు అస్తవ్యస్తమయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థలోకీలకభూమిక పోషించే ఐటీ.. బీపీఓ అనుబంధ రంగాలపై భారీ ప్రభావం పడింది. మార్చి నుంచి ఇప్పటివరకూ దగ్గర దగ్గర పాతిక నుంచి ముప్ఫై వేల వరకూ ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగాల్ని కోల్పోయినట్లుగా చెబుతున్నారు. ఈ ముప్పు ఇక్కడితో అయిపోలేదని.. రానున్న రోజుల్లో మరెంతోమందికి తప్పదన్న పరిశ్రమ వర్గాల మాట ఐటీ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి.

దేశంలోని ఐటీ.. బీపీఓ కంపెనీల్లో దగ్గర దగ్గర 43.6 లక్షల మంది పని చేస్తున్నారు. పరోక్షంగా వీరికి ఆధారంగా నడిచే రంగాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికే ఐటీ కంపెనీలు పని చేయకుండా.. ఇంటి నుంచే ఉద్యోగుల చేత పని చేయిస్తున్న నేపథ్యంలో.. సెక్యురిటీ గార్డులు.. ఆఫీసు సిబ్బంది.. నిర్వహణ రంగానికి చెందిన పలువురి ఉపాధికి దెబ్బ పడింది. ఇదిలా ఉంటే..రానున్న రోజుల్లో మరింత మంది ఉద్యోగులపై వేటు పడితే.. దాని ప్రభావం ఇబ్బందికరంగా ఉంటుందని చెబుతున్నారు.

క్లయింట్లు ఐటీ వ్యయాల్ని తగ్గించుకోవాలని చూస్తున్నారు. దీంతో.. కొత్త ప్రాజెక్టులు తగ్గిపోయాయి. దీంతో కంపెనీల మీద ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జులై నుంచి సెప్టెంబరు త్రైమాసికంలో చాలా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల్ని తగ్గించుకునే అవకాశం ఉందన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే 50 నుంచి 60 వేల మంది ఉద్యోగులు వేతనం లేని సెలవుల్లో ఉన్నారు. రానున్న రోజుల్లో వీరి సంఖ్య పెరగనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

చిన్నకంపెనీలు మొదలు మధ్యస్త.. దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగుల్ని ఇంటికి పంపించే పనిని షురూ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఐబీఎం ప్రపంచ వ్యాప్తంగా 2వేల మందిని తొలగిస్తుంటే.. కాగ్నిజెంట్ 18వేల మందిని ఇంటికి పంపించేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. యాక్సెంచర్ సైతం దాదాపు వెయ్యి మంది వరకూ ఉద్యోగుల్ని తొలగించే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే బాటలో టీసీఎస్.. విప్రో.. ఇన్ఫోసిస్.. హెచ్ సీఎల్ టెక్నాలజీస్ తో సహా పలు కంపెనీల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉందంటున్నారు. ఉద్యోగుల కోతనే కాదు.. జీతాల కోతకు కూడా తెరతీసినట్లు తెలుస్తోంది. కనిష్ఠంగా 15 శాతం నుంచి గరిష్ఠంగా 25 శాతం మధ్యలో జీతాల కోత ఉందన్న మాట వినిపిస్తోంది.

Next Story