రిలయన్స్‌తో గూగుల్ దోస్తీ.. 2021నాటికి 5జీ రెడీ
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 July 2020 2:30 PM GMTకర్లో దునియా ముఠ్ఠీమే అంటూ.. చాలామంది ప్రజల అరచేతిలోకి ప్రపంచాన్ని తెచ్చిపెట్టిన ఘనత రిలయన్స్ ధీరూభాయ్ అంబానీదే. తన తండ్రి అడుగుజాడల్లో నడిచిన ముకేశ్ అంబానీ.. జియో జీ భర్ కే అంటూ కారు చౌకగా మొబైల్ డేటాతో పాటు ఫోన్ ను సామాన్యులకు అందించారు. టెలికాం రంగంలో జియో దెబ్బకు తట్టుకోలేక చాలా టెలికాం కంపెనీలు నష్టాలను చవిచూశాయి. జియో 4జీ సేవల ధాటికి మిగతా కంపెనీలు కుదేలయ్యాయి.
ఇక, 'జియోమార్ట్'పేరుతో 'దేశ్ కీ నయీ దుకాన్' అంటూ రిటైల్ ఈ-కామర్స్ సంస్థలకు రిలయన్స్ షాకిచ్చింది. ఈ కామర్స్ రంగంలో మరింత వేగంగా దూసుకుపోయేందుకు రూ. 43,574 కోట్ల విలువైన అతిపెద్ద ఎఫ్ డీఐ డీల్ తో ఫేస్ బుక్-వాట్సాప్ లతో జత కట్టింది. ఇక, తాజాగా జరిగిన రిలయన్స్ మరో అడుగు ముందుకు వేసింది. వచ్చే ఏడాది నాటికి భారత్ లో 5జీ సేవలను ప్రారంభించే అవకాశముందని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన చేశారు.
జియో సొంతంగా 5జీ సొల్యూషన్స్ ను డెవలప్ చేసిందని రిలయన్స్ వార్షిక సమావేశంలో అంబానీ చేసిన ప్రకటన ఇపుడు భారత్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రపంచ స్థాయి సేవల్ని అందించే విధంగా 5జీ సేవలను రూపొందిస్తున్నామని అంబానీ తెలిపారు. జియోలో 7.7 వాతం వాటాను గూగుల్ రూ.33,737 కోట్లు పెట్టుబడితో కొనుగోలు చేసిందని అంబానీ వెల్లడించారు.
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) నేడు ఆన్ లైన లో జరిగింది. కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ లో ఈ సమావేశం నిర్వహించారు. గత ఏడాది జరిగిన వార్షిక సమావేశంలో అంబానీ ఒక ప్రకటన చేశారు. తమ సంస్థ అప్పులన్నీ వచ్చే వార్షిక సమావేశం నాటికి తీర్చేస్తానని ప్రకటించారు.
అన్నమాట ప్రకారం.. ఇపుడు రిలయన్స్ ను రుణ రహిత సంస్థగా తీర్చిదిద్దారు. అంతేకాదు, ఫేస్ బుక్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు రిలయన్స్ లో భారీ పెట్టుబడులు పెట్టేలా చేసిన ఘనత అంబానీదే. 150 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సాధించిన తొలి భారతీయ కంపెనీగా చరిత్రను క్రియేట్ చేసింది రిలయన్స్. మానవ చరిత్రలో అత్యంత ఇబ్బందికర పరిస్థితిని ఇపుడు భారత్ తో పాటు యావత్ ప్రపంచం ఎదుర్కొంటోందని అంబానీ అన్నారు. ప్రతి కష్టం కొత్త అవకాశాల్ని తెచ్చి పెడుతుందని అంబానీ చెప్పారు. భారత్‌లో అతిపెద్ద రైట్స్ ఇష్యూని కూడా పూర్తి చేశామన్న అంబానీ.. జియో ప్లాట్‌ఫామ్‌లో 7.7శాతం వాటా కోసం గూగుల్ రూ.33,737 కోట్లను పెట్టుబడి పెట్టనుందని వెల్లడించారు.
కన్జ్యూమర్ వ్యాపారం ఈబీఐటీడీఏ 49శాతం వృద్ధి సాధించిందని, భారత్‌లో వేగంగా పెరిగిన డేటా డిమాండ్ కోసం జియో సొంతంగా 5జీ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసిందని చెప్పారు. ఇది ప్రపంచ స్థాయి సేవలను భారత్‌కు వచ్చే ఏడాది నుంచి అందించే అవకాశముందని, స్పెక్ట్రం రాగానే త్వరలోనే పరీక్షిస్తామని అన్నారు.
4జీ లేదా 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్ డిజైన్ చేయగలదని నమ్ముతున్నామని, గూగుల్‌తో కలిసి ఆండ్రాయిడ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయనున్నామని ముఖేష్ అంబానీ వెల్లడించారు. కొవిడ్, మార్కెట్లోని ఇతర కారణాల వల్ల అరామ్‌కో డీల్ అనుకున్నంతగా ముందుకు సాగలేదన్న అంబానీ.. ఆ సంస్థతో దీర్ఘకాలిక బంధాన్ని కొనసాగిస్తామన్నారు. రిలయన్స్ మిగిలిన భారతీయ కంపెనీలు, స్టార్టప్‌లతో కలిసి ‘మేడిన్ ఇండియా’, ‘మేడ్ ఫర్ ఇండియా’, ‘మేడ్ ఫర్ వరల్డ్ ’ విధానాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తుందన్నారు.
‘మిషన్ అన్నసేవ’ కింద రిలయన్స్ 5 కోట్ల మంది పేదలకు భోజనాలను అందించిందని ముకేశ్ సతీమణి నీతా అంబానీ తెలిపారు. కరోనా టీకా వచ్చాక అది ప్రతిఒక్కరికి చేరేలా తమ డిజిటల్ నెటవర్క్ ద్వారా సాయం చేస్తామన్నారు.
ఇషా, ఆకాశ్ అంబానీలు జియోటీవీ ప్లస్‌ను ప్రదర్శించారు. ఈ సమావేశంలోనే జియోగ్లాస్‌ను ఆవిష్కరించారు. కేవలం 75 గ్రాముల బరువుండే ఈ స్మార్ట్ కళ్లద్దాలలో 25 రకాల యాప్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇది మిక్స్‌డు రియాలటీ సేవలను అందిస్తుందని, దీనికి కేబుల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చని వెల్లడించారు.
200 పట్టణాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహించిన జియో మార్ట్ ప్రాజెక్టుకు సానుకూల స్పందన లభించిందని ఇషా అంబానీ అన్నారు. ఈ ఏజీఎంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఆన్ లైన్లో పాల్గొన్నారు. స్మార్ట్‌ఫోన్, చౌకగా లభించే డేటా...భారతీయులు తేలిగ్గా ఆన్‌లైన్‌లోకి వచ్చేందుకు సహాయపడుతున్నాయని పిచాయ్ అన్నారు.’’ అని పేర్కొన్నారు. అనంతరం జియోతో జట్టుకట్టిన అంశాన్ని ట్విటర్‌లో పిచాయ్ వెల్లడించారు.