ఏటీఎం సెంటర్లలో నగదు డిపాజిట్లలో గోల్‌మాల్..
By తోట వంశీ కుమార్ Published on 6 Aug 2020 5:51 AM GMT
హైదరాబాద్‌లోని మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఏటీఎంలలో నగదును నింపే సిబ్బంది భారీ అవకతవకలు పాల్పడ్డారు. దాదాపు కోటి 23 లక్షల గోల్‌మాల్‌కు పాల్పడినట్లు ఆడిటింగ్‌లో గుర్తించారు. దీంతో వారిపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్‌కు చెందిన సెక్యూర్ వ్యాల్యూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వివిధ బ్యాంకుల ఏటీఎం యంత్రాల్లో నగదును డిపాజిట్ చేసే కాంట్రాక్ట్‌తో క్యాష్ మేనేజ్‌మెంట్, క్యాష్ ర్లీప్లస్‌మెంట్ సర్వీస్‌ను నిర్వహిస్తోంది. దీని కోసం బిటిఐ పేమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. 36 ఏటీఎం సెంటర్లలో నగదు డిపాజిట్ చేసేందుకు బిటిఐకు కాంట్రాక్టు ఇచ్చింది. బిటిఐలో రాజశేఖర్ రెడ్డి, రమా భారత్, సాయితేజ్, అశ్విన్‌లను కస్టోడియన్లుగా నియమించి ఏటీఎం తాళాలు, పాస్ వర్డులు వారికి అప్పగించారు. కొద్ది కాలం బాగానే ఉన్నా.. ఇటీవల రాజశేఖర్ రెడ్డితో పాటు మిగతా ముగ్గురు కస్టోడియన్లుగా వ్యవహరిస్తున్న రూట్లలో రిపోర్టు రావడం లేదు. దీంతో అనుమానం వచ్చిన కంపెనీ ప్రతినిధులు ఆడిటింగ్ నిర్వహించారు. ఈ ఆడిటింగ్‌లో కోటి 23లక్షల నగదు గోల్‌మాల్ జరిగినట్లు సిబ్బంది గుర్తించారు. . దీనిపై సికింద్రాబాద్ సెక్యూర్ వ్యాల్యూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.