గోల్డ్ స్టోన్ ప్రసాద్‌కు ఎదురుదెబ్బ: పైగా భూములు నవాబులవే

By Newsmeter.Network  Published on  26 Dec 2019 6:56 AM GMT
గోల్డ్ స్టోన్ ప్రసాద్‌కు ఎదురుదెబ్బ: పైగా భూములు నవాబులవే

''గోల్డ్ స్టోన్'' ప్రసాద్ కి చెందిన గోల్డ్ స్టోన్ ఎక్స్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మరో పదహారు కంపెనీలు, కొందరు వ్యక్తులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నిజామ్ రాజ కుటుంబ బంధువులైన పైగాలకు చెందిన 98.10 ఎకరాల భూమి తమదేనని వాదించిన వీరందరి వాదనలను రాష్ట్ర హైకోర్టు పూర్తిగా తిరస్కరించింది. అంతేకాక వాదులందరూ పదివేల రూపాయల చొప్పున ఖర్చుల నిమిత్తం ప్రతివాదులకు చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది.

రంగారెడ్డి జిల్లా బాలానగర్ మండలంలో కూకట్ పల్లి సమీపంలోని హైదర్ నగర్ గ్రామంలో ఉన్న ఈ భూములు పైగాలకు చెందినవి. వారికి 1947 కి ముందు ఈ భూములను కేటాయించారు. అయితే ఈ విషయంలో ఈ భూములకు అంతిమ డిక్రీ ఇవ్వడం జరగలేదని న్యాయస్థానం తెలిపింది. ఇప్పుడు ఈ భూములు వాటి అసలు యజమానులైన కాసిమ్ నవాబ్ జంగ్ తదితరులకు చెందుతాయి. వారి నుంచి భూములు తీసుకునేందుకు యత్నించిన వారిని కో్ర్టు తప్పు పట్టింది. ఈ తీర్పుతో వివాదాస్పద గోల్డ్ స్టోన్ ప్రసాద్, ఆయన భార్య ఇంద్రాణీ ప్రసాద్ లకు చెందిన సైరస్ ఇన్వెస్ట్ మెంట్ ప్రైవేట్ కంపెనీ, గోల్డ్ స్టోన్ కంపెనీలు చేస్తున్న మోసాలు బట్టబయలైనట్టయింది. యాభై ఏళ్ల క్రితమే తమకు అనుకూలంగా ప్రాథమిక డిక్రీ పాస్ అయిందని వాదిస్తూ వారు ఈ భూములను ఆక్రమించుకున్నారు. న్యాయమూర్తులు ఎం ఎస్ రామచంద్ర రావు, కె లక్ష్మణ్ లతో కూడిన ధర్మాసనం ఈ డిక్రీ చెల్లదని ప్రకటించింది. ఈ భూములు జాగీర్దారీ భూములని, జాగీర్దారీ చట్టం అమలుకు ముందే వచ్చిందని తమకు అనుకూలంగా డిక్రీని వీరు తప్పుడు పద్ధతుల ద్వారా మోసపూరితంగా పొందారని కోర్టు తీర్పులో వెల్లడించింది. దీనితో గోల్డ్ స్టోన్ ప్రసాద్ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్టయింది.

Next Story
Share it