'గోల్డ్ బోర్డు': మోదీ సర్కారు మరో సంచలనం నిర్ణయం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Oct 2019 12:30 PM GMT
గోల్డ్ బోర్డు: మోదీ సర్కారు మరో సంచలనం నిర్ణయం..!

మోదీ సర్కారు మరో సంచలనం నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. ఈసారి బంగారంపై ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి సారించింది. లెక్కల్లో చూపని పసిడిని బహిర్గతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అక్రమంగా దాచుకున్న బంగారాన్ని బయటపెట్టడంతో పాటు పన్ను చెల్లించే అవకాశం కల్పించనున్నారని సమాచారం. ఇందుకు సంబంధించి త్వరలో గోల్డ్ బోర్డ్ ఏర్పాటు చేయనున్నారు. బంగారం కొనుగోలు విధి విధానాలను గోల్డ్ బోర్డు ఖరారు చేయనుంది. పన్నులు ఎగ్గొట్టి, అక్రమంగా దాచుకున్న స్వర్ణంపై టాక్స్ విధిస్తారని తెలుస్తోంది. ఈ పథకం కింద వ్యక్తుల వద్ద పరిమితికి మించి ఉన్న బంగారాన్ని వెల్లడించి దానిపై పన్నులు చెల్లించే అవకాశం కల్పిస్తారని ఢిల్లీ వర్గాలు పేర్కొన్నాయి.

బంగారం వెల్లడికి సంబంధించిన పథకం విధి విధానాలపై ఇంకా స్పష్టత రాలేదు. పన్ను రేటు ఎంత ఉంటుంది..? ఎప్పటి నుంచి అమలు చేస్తా రు..? పరిమితులకు సంబంధించిన ఇతర నిబంధనలను నిర్ణయించలేదని సమాచారం. 2014-16 మధ్యలో ప్రభుత్వం నల్లధనంపై ప్రవేశపెట్టిన క్షమాభిక్ష పథకాల మాదిరిగానే ఇది కూడా ఉండవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. పెళ్లైన మహిళల వద్ద ఉన్న బంగారానికి ఇప్పటికే ఉన్న పరిమితికి మించి మరికొంత మినహాంపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గోల్డ్ బోర్డు ఏర్పాటు తర్వాత కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. అది కూడా బంగారానికి సంబంధిం చినదే. గోల్డ్ పరిమితుల్లో మార్పులు చేర్పులు చేయాలని మోదీ సర్కారు భావి స్తోంది.

దేశంలో నల్లధనం నిర్మూలించడానికి 2016లో మోదీ సర్కారు పెద్ద నోట్లను రద్దు చేసింది. అప్పటివరకు వినియోగంలో ఉన్న వెయ్యి, 5 వందల రూపాయల నోట్లను నవంబర్ 8న రాత్రికి రాత్రే రద్దు చేసింది. ఐతే, నోట్ల రద్దు తర్వాత అక్రమార్కులు పసిడిపై దృష్టి పెట్టినట్లు కేంద్రం భావిస్తోంది. పన్నులు ఎగ్గొట్టిన, అక్రమంగా సంపాదించిన సొమ్మును బంగారంపై పెట్టుబడి పెడుతున్నట్లు కేంద్ర వర్గాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో నల్ల ధనాన్ని అరికట్టడానికి బంగారాన్ని మోదీ సర్కారు టార్గెట్ చేసినట్లు సమాచారం. ఐతే, ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి సమాచారం వెలువడలేదు. పెద్ద నోట్ల రద్దు తర్వాత కూడా బంగారంపై పరిమితుల్లో మార్పు లు చేస్తారనే వార్తలు వచ్చినప్పటికీ అలాంటిదేమీ జరగలేదు.

Next Story