Fact Check : అమ్మవారికి కోటి రూపాయలతో అలంకరణ చేశారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Oct 2020 3:58 PM IST
Fact Check : అమ్మవారికి కోటి రూపాయలతో అలంకరణ చేశారా..?

వివిధ రకాల నోట్లతో అమ్మవారిని అలంకరించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి. అమ్మవారి అలంకరణకు ఏకంగా కోటి రూపాయలను ఉపయోగించారని చెబుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల్ లో అమ్మవారికి కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరణ చేశారని పోస్టులు పెడుతూ ఉన్నారు.

దసరా ఉత్సవాల్లో భాగంగా వాసవి మాతను కోటి రూపాయల 11 లక్షల రూపాయలతో అలంకరించారంటూ పోస్టులు పెట్టారు. ట్విట్టర్ లో కూడా ఈ వీడియోను పోస్టు చేశారు.



నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టులు 'నిజం'.

వీడియోకు సంబంధించిన కీఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ వీడియో పలు మీడియా సంస్థలు సామాజిక మాధ్యమాల్లోనూ, యూట్యూబ్ లోనూ పోస్టు చేయడం జరిగింది.



NDTV ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కూడా ఈ వైరల్ వీడియోను ట్వీట్ చేశారు. “Decorations with currency worth Rs 1,11,11,111 for #Dhanalakshmi avatar of #KanyakaParameswariDevi at #Gadwal #Telangana as part of #Navaratri; three years ago it was Rs 3,33,33,333 currency decoration … Pandemic, economic slowdown presumably has its effects @ndtv @ndtvindia (sic).” అంటూ వీడియోను షేర్ చేశారు. మూడు సంవత్సరాల కిందట ఇదే దేవాలయంలో మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడువందల ముప్పై మూడు రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించారని వివరించారు. ఈ ఏడాది కరోనా కారణాల వలన ఒక కోటి 11 లక్షల 11వేల నూట పదకొండు రూపాయలతో అలంకరించారని స్పష్టం చేశారు.

అక్టోబర్ 25న దైవ చింతన అనే యూట్యూబ్ ఛానల్ లో కూడా వీడియోను అప్లోడ్ చేశారు.

Tamil Bajans అనే యూట్యూబ్ ఛానల్ లో కూడా గద్వాల్ లోని వాసవి మాతను కోటి రూపాయలకు పైగా డబ్బుతో అలంకరించారని స్పష్టం చేశారు.

కీవర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా తెలుగు మీడియా ఛానల్ అయిన భారత్ టుడేలో అక్టోబర్ 24న వీడియోను అప్లోడ్ చేశారు. ఆర్య వైశ్య సంఘం నవరాత్రి ఉత్సవాలను ఏర్పాటు చేశారని.. అమ్మవారిని కోటి 11 లక్షల 11 వేల 111 రూపాయలతో అలంకరించారని వివరించారు.

2017 సంవత్సరంలో ఇదే ఆలయంలో అమ్మవారిని 3,33,33,333 రూపాయలతో అలంకరించారు. అందుకు సంబంధించిన వీడియో ETV యూట్యూబ్ ఛానల్ లో సెప్టెంబర్ 2017న అప్లోడ్ చేశారు.

2019 లో కూడా ఆలయంలో అమ్మవారిని డబ్బులతో అలంకరించారు. Vysyamala ఫేస్ బుక్ పేజీలో అందుకు సంబంధించిన పోస్టులను చూడొచ్చు.

తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల్ లో ఉన్న కన్యకాపరమేశ్వరి గుడిలో వాసవీ మాతను కోటి రూపాయలు డబ్బులతో అలంకరించడం 'నిజం'.

Claim Review:Fact Check : అమ్మవారికి కోటి రూపాయలతో అలంకరణ చేశారా..?
Claim Reviewed By:Satyapriya
Claim Fact Check:false
Next Story