విహారానికి వెళ్లిన నటి.. నదిలో శవమై తేలింది
By తోట వంశీ కుమార్ Published on 14 July 2020 11:49 AM ISTహాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. నదిలో విహారానికి వెళ్లిన నటి ఐదు రోజుల తరువాత నదిలో శవమై కనిపించింది. వివరాల్లోకి వెళితే.. నటి రివీరా తన కుమారుడితో కలిసి కాలిఫోర్నియాలోని పెరూ లేక్‌కు ఐదు రోజుల క్రితం వెళ్లింది. అక్కడ బోటును అద్దెకు తీసుకుని బోటింగ్ వెళ్లింది. ఉదయం వెళ్లిన ఆమె సాయంత్రమైనా తిరిగి రాలేదు. దీంతో బోటు అద్దెకు ఇచ్చిన యజమాని పోలీసులకు, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
బుధవారం సాయంత్రం వారికి ఓ బోటు కనిపించింది. బోటులో చూడగా.. పిల్లాడు పడుకుని ఉన్నాడు. బోటులో లైఫ్ జాకెట్, రివీరా పర్సును గుర్తించారు. ఆమె కోసం నది జల్లెడ పట్టారు. ఐదు రోజుల తరువాత నిన్న సాయంత్రం ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. అమ్మ, నేను ఈత కొట్టడానికి వెళ్లామని, తాను వచ్చినా అమ్మ తిరిగి రాలేదని ఆమె కుమారుడు కుటుంబ సభ్యులకు చెప్పాడు. రివీరా ఆత్మహత్య చేసుకుందా లేదంటే ప్రమాదవశాత్తు నదిలో పడి మరణించిందా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫాక్స్ మ్యూజికల్ సినిమా గ్లీ లో నటించిన ఈ నటి మంచి పేరు తెచ్చుకుంది. రివీరా మరణం పట్ల హాలీవుడ్ చిత్ర పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది.