షాక్‌లో బాలీవుడ్.. మరో నటుడు మృతి

By రాణి  Published on  13 July 2020 9:05 AM GMT
షాక్‌లో బాలీవుడ్.. మరో నటుడు మృతి

వరుస మరణాల నుంచి బాలీవుడ్ ఇప్పటికీ తేరుకోలేదు. ప్రముఖ నటులైన రిషికపూర్, ఇర్ఫాన్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్, సరోజ్ ఖాన్ మరణాలు బాలీవుడ్ ను తీవ్ర దుఃఖంలోకి నెట్టివేశాయి. ఆ దుఃఖం నుంచి పూర్తిగా కోలుకోకుండానే మరో యువనటుడు మృతి చెందడం బాలీవుడ్ ను కలవరపరుస్తోంది. నటుడు రంజన్ సెహగల్ (36) శనివారం రాత్రి తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు.

బాలీవుడ్ నటుడు రంజన్ సెహగల్ వెండితెర కన్నా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడని చెప్పాలి. థియేటర్ యాక్టర్ గా తన కెరియర్ ను ప్రారంభించిన రంజన్ ఆ తర్వాత జీ పంజాబీ టెలివిజన్ ఛానెల్ లో పనిచేశారు. చడ్యా ఛాన్ సముందర్ పార్, క్రైమ్ పెట్రోల్ సీరియళ్లు, సవాధన్ ఇండియా షో రంజన్ కు మంచి ప్రేక్షకాదరణ తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఆయన ఐశ్వర్యరాయ్, రణదీప్ హుడా నటించిన సరబ్ జిత్ లో ముఖ్యపాత్ర పోషించి గుర్తింపు తెచ్చుకున్నారు. షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన జీరో చిత్రంలో కూడా రంజన్ నటించారు.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రంజన్ సెహగల్ శరీరంలో ఎన్నడూ లేని మార్పులు కనిపించాయి. కొద్ది కరోనా లక్షణాలు కూడా ఉండటంతో క్వారంటైన్ లో ఉన్నారు. కానీ ఆరోగ్యం మరింత క్షీణించడంతో చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్‌లో చేరారు. అక్కడ చేరేటప్పటికే రంజన్ శరీరంలోని అవయవాలు ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. చికిత్స పొందుతూ శనివారం రాత్రి రంజన్ సెహగల్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రంజన్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ నటులు సంతాపం తెలిపారు.

Next Story