దొంగబాబా దుర్మార్గం.. 16 వేల మంది యువతులే టార్గెట్‌..!

By అంజి  Published on  29 Feb 2020 7:28 AM GMT
దొంగబాబా దుర్మార్గం.. 16 వేల మంది యువతులే టార్గెట్‌..!

ముఖ్యాంశాలు

  • ప్రస్తుతం పరారీలో వీరేంద్ర దేవ్‌ దీక్షిత్‌
  • వింతగా మాట్లాడుతున్న సంతోషి రూప
  • ఆచూకీ చెప్తే రూ.5 లక్షలు

ఢిల్లీ: కాటికి కాలు చాచే వయసుకు దగ్గరగా ఉన్న ఓ ముసలివాడు.. తనును తాను శ్రీకృష్ణుడి అవతారంగా ప్రకటించుకున్నాడు. అంతే కాదు పురాణంలో శ్రీకృష్ణుడు 16 వేల మంది గోపికలతో ఆడిపాడితే.. ఇప్పుడు ఈ ముసలి దొంగబాబ కూడా 16 వేల మంది అమ్మాయిలను చేరపట్టేందుకు ఢిల్లీలో ఆశ్రమం స్థాపించి దుర్మర్గానికి తెరతీశాడు. ఈ దొంగ బాబా మాటలు నమ్మి ఎంతో మంది మహిళలు, యువతులు మోసపోయారు. దొంగబాబా వలలో పడిన యువతుల్లో తెలుగు అమ్మాయి కూడా ఉంది.

శ్రీకృష్ణుడి అవతారంగా ప్రకటించుకున్న దొంగ బాబా అసలు పేరు వీరేంద్ర దేవ్‌ దీక్షిత్‌.. ఉత్తరప్రదేశ్‌లో పుట్టిన ఈ దొంగబాబా ఢిల్లీలో అధ్యాత్మిక విద్యాలయం పేరుతో యువతులను బందీలుగా చేసుకున్నాడు. 2020లో ప్రపంచం అంతం అవుతుందంటూ.. మిమ్మల్ని తాను రక్షిస్తానని అమాయకులను ఆకట్టుకున్నాడు. తన దగ్గరికి వచ్చే అమాయక ప్రజలను నమ్మించి.. మాయలో పడేసి.. వారి కూతుళ్లను ఆశ్రమానికి పంపాలని కోరేవాడు. ఇక ఒక్కసారి ఆశ్రమంలో అమ్మాయిలు అడుగు పెడితే అంతే.. తిరిగి వెళ్లడానికి అవకాశం ఉండదు. ఒక వేళ కూతురు చూడాలనిపించి వచ్చిన తల్లిదండ్రులు గంటల తరబడి ఆశ్రమం ముందు వేచి చూడాల్సిందే. దొంగబాబా ఆశ్రమానికి దేశ వ్యాప్తంగా కేంద్రాలు కూడా ఉన్నాయని సమాచారం. ఒక్క ఢిల్లీలోనే ఐదు ఆశ్రమాలు ఉన్నాయని తెలిసింది.

ఏ ఆశ్రమానికి వెళ్తే.. అక్కడ గుప్తప్రసాదం పేరుతో రాత్రి దొంగబాబా గదికి కనీసం ఐదు నుంచి 10 మంది అమ్మాయిలను పంపుతారని, ఆ తెల్లారి నుంచి వారిని రాణులుగా పిలుస్తారని.. ఆశ్రమం నుంచి బయటపడ్డ కొందరు యువతులు చెప్పారు. 2017లో మొదటిసారిగా ఓ యువతి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించడంతో వీరేంద్ర దేవ్‌ బాబాబ లీలలు వెలుగులోకి వచ్చాయి. కోర్టు ఆదేశాల మేరకు అప్పుడు పోలీసులు, న్యాయవాదులతో కలిసి ఓ బృందం ఏర్పాటైంది. ఈ బృందం ఆశ్రమంలో తనిఖీలు జరిపి దాదాపు 67 మంది యువతులను ఆశ్రమ చెర నుంచి విడిపించింది. ఆశ్రమంలోని ఇరుకు గదుల్లో యువతులను ఉంచారని ఆ బృందం కోర్టుకు తెలిపింది.

బ్రహ్మకూమారీస్‌ సంస్థ స్ఫూర్తితో తాను అధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నానని దొంగబాబా చెప్పుకునేవాడు. అయితే అతడి ప్రచారాన్ని బ్రహ్మకుమారీస్‌ సంస్థ ఖండించింది. ఆ తర్వాతే ఆధ్యాత్మిక ఐశ్వర్య విశ్వవిద్యాలయ్‌ పేరిట ఢిల్లీలో ఆశ్రమం స్థాపించాడు. శ్రీకృష్ణుడివలే 16 మంది గోపికలను ఏర్పాటు చేసుకోవాలన్న లక్ష్యంతోనే యువతులకు వలవేస్తున్నాడని స్థానికులు తెలిపారు.

దొంగబాబా ఉచ్చులో తెలుగు యువతి..

నిజామాబాద్‌కు చెందిన సంతోషి రూప అనే యువతి కూడా వీడి మాయలో పడింది. అనంతపూర్‌ జేఎన్‌టీయూలో కెమికల్‌ ఇంజినీరింగ్‌ చేసి ఉన్నత చదువులకు అమెరికా వెళ్లిన సంతోషి రూప.. నానో టెక్నాలజీలో పరిశోధనలు చేసింది. ఈ క్రమంలోనే 2015లో సంతోషి రూప అదృశ్యమైంది. ఆమె తల్లిదండ్రులు ఆరా తీయగా సంతోషి రూప.. వీరేంద్ర దేవ్‌ ఆశ్రమంలో చేరినట్లు తెలిసింది. ఆమెను పలుమార్లు కలిసిన తల్లిదండ్రులు ఇంటికి రావాలని ఎంత జెప్పినా వినిపించుకోవడం లేదని చెప్పారు. అయితే ఆశ్రమంలో ఉన్న సంతోషిరూప పూర్తిగా మారిపోయింది. మీరందరూ త్వరలో మరణిస్తారని, నేను దేవతను అవుతానంటూ చెబుతూ వింత మాటలు మాట్లాడుతోంది. ఆశ్రమంలో ఉన్న తన కూతురిని ఎలాగైన విడిపించాలని సంతోషిరూప తండ్రి రాంరెడ్డి కోరుతున్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవాలంటూ ఆయన అభ్యర్థించారు. తమతో రావడానికి నిరాకరించడంతో.. కోర్టును ఆశ్రయించామని రాంరెడ్డి తెలిపారు.

అయితే పరారీలో ఉన్న దొంగబాబు ఆచూకీ చెప్తే రూ.5 లక్షలు ఇస్తామని సీబీఐ ప్రకటించింది. దొంగబాబా అక్రమాలపై సీబీఐ విచారణ జరుపుతోంది.

సీబీఐ దర్యాప్తు..

హైకోర్టు ఆదేశాల మేరకు వీరేంద్ర దేవ్‌పై కేసులను పోలీసులు.. సీబీఐకి అప్పగించారు. దొంగ బాబా వీరేంద్ర దేవ్‌ దీక్షిత్‌ అక్రమాలపై సీబీఐ మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. ఇప్పటికే అతడిపై రెండు లూక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు. ఇంటర్‌ పోల్‌ కూడా బ్లూనోటీస్‌ జారీ చేసింది. వీరేంద్ర దేవ్‌ రెండు సంవత్సరాలుగా పరారీలో ఉన్న.. అతడి ఆశ్రమం ఇంకా నడుస్తుండడం మన వ్యవస్థలోని లోపాలకు అద్దంపడుతోంది.

Next Story