చిలుకను వదిలిందని చిన్నారిని చంపాడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Jun 2020 12:52 PM IST
చిలుకను వదిలిందని చిన్నారిని చంపాడు

మనిషికి ఏమైంది? కనీసంగా ఉండాల్సిన మానవత్వం ఎందుకు మిస్ అవుతోంది? చిన్న కారణాలకే చంపేస్తున్న తీరు ఆందోళనను కలిగించేలా మారింది. తోటి మనిషి పట్లే కాదు.. మూగజీవాల్ని సైతం వదలని కాఠిన్యం కొత్త టెన్షన్ పుట్టిస్తోంది. మనిషి చేసిన తప్పులకు శిక్షగా మాయదారి రోగం ప్రపంచాన్ని చుట్టేయటమేకాదు.. గడిచిన కొన్ని నెలలుగా మనిషి ఎంతలా అతలాకుతలం అవుతున్నాడో తెలియంది కాదు. మాయదారి రోగం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 65లక్షలకు పైగా బాధితులుగా మారితే.. వారిలో 3.84లక్షల మంది ఇప్పటికే మరణించారు.

రానున్న రోజుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరగటమే కాదు.. మరణాలు పెద్ద ఎత్తున చోటుచేసుకునే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. భూమి మీద మనిషి ఒక్కడే కాదు.. కోట్లాది జీవచరాలు ఉన్నాయి. వాటితో కలిసి కాకుండా.. తన స్వార్థం కోసమే బతికేస్తున్న మనిషిలో దుర్మార్గం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా తమిళనాడులో ఆకలితో ఉన్న గర్భస్త ఏనుగుకు తిండి పెట్టే పేరుతో.. ఫైనాపిల్ లో బాంబు పెట్టిన దుర్మార్గం కలిచివేస్తోంది. తన ప్రాణం తీయటానికి ప్రయత్నించి వారిని క్షమించేసి.. తనకు తాను ప్రాణాలు విడిచిన గజరాజు తీరు కన్నీళ్లు పెట్టిస్తోంది.

ఈ ఉదంతంపై మనసున్న ఎందరో రియాక్టు అవుతున్నా.. ఇలాంటి ఘోరానికి పాల్పడిన వ్యక్తి తమలోని వాడే అన్న ఆలోచన మరింత వేదనకు గురి చేస్తోంది. తాజాగా పొరుగున ఉన్న పాకిస్థాన్ లో ఒక చిన్నారిని చంపేసిన కారణం తెలిస్తే.. అయ్యో అనకుండా ఉండలేం. ఎనిమిదేళ్ల పాపతో పని చేయించటం ఒక తప్పు అయితే.. పొరపాటుగా చేసిన పనికి ఆ పసిదాని ప్రాణాలు తీసిన కర్కసత్వం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

రావల్పిండిలోని ఒక ఇంట్లో ఎనిమిదేళ్ల పాప పనికి కుదిరింది. ఆ ఇంటి యజమాని పంజరాల్లో పెంపుడు చిలకల్ని పెంచుతుంటాడు. వాటిని శుభ్రం చేసే క్రమంలో ఒక

ఖరీదైన చిలుక ఎగిరిపోయింది. అంతే.. ఆగ్రహించిన ఆ యజమాని ఆ పాపను విచక్షణరహితంగా కొట్టాడు. దీంతో.. ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది. యజమానిని అదుపులోకి తీసుకున్నా.. పోయిన పసిదాని ప్రాణం తిరిగి రాదు కదా? కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్న మనిషి తీరు ఇప్పుడు కొత్త ఆందోళనకు గురి చేస్తోంది.

Next Story