జన్యుపరంగా మార్పు చేయబడిన దోమలు.. మనకేమీ ముప్పుగా మారవు కదా..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Aug 2020 11:22 AM GMT
జన్యుపరంగా మార్పు చేయబడిన దోమలు.. మనకేమీ ముప్పుగా మారవు కదా..!

750 మిలియన్ల దోమలను ఫ్లోరిడాలో వదలడానికి స్థానిక అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. అదేంటి దోమల కారణంగానే కదా ఎన్నో రోగాలు వస్తోంది.. మరీ మనమే తయారు చేసి వాటిని మన పరిసరాల్లోకి వదలడం ఎంతవరకూ శ్రేయస్కరం అని పలువురు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దీన్ని స్థానికులు, పర్యావరణ ప్రేమికులు తప్పుబడుతున్నారు. కానీ అధికారులు మాత్రం అనుకున్నది చేయడానికి సమాయత్తం అవుతున్నారు. స్టేట్, ఫెడరల్ అప్రూవల్ రావడంతో 2021, 2022లలో ఈ జెనెటికల్లీ మాడిఫైడ్ దోమలను ఫ్లోరిడాలో వదులనున్నారు.

ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న సమస్యలు చాలవన్నట్లుగా ఈ జురాసిక్ పార్క్ ఎక్స్పెరిమెంట్ అవసరమా అని జేడీ హాన్సన్ చెబుతున్నారు. కోవిద్-19 ను ఎదుర్కోవడం, జాత్యహంకార దాడులు, వాతావరణ మార్పులు వంటి ఎన్నో సమస్యలు ఉంటే వాటిని పెద్దగా పట్టించుకోకుండా ఇలాంటి వాటిపై ప్రజల సొమ్మును వెచ్చించడం అవసరమా అని అభిప్రాయపడ్డారు. మన్రో కౌంటీ మస్కిటో కంట్రోల్ డిస్ట్రిక్ట్ ఇందుకోసం తుది ఆమోదం కూడా ఇచ్చింది. ఏమి జరుగుతుందో.. పర్యావరణానికి ఎటువంటి హాని కలుగుతుందో ఎవరికీ తెలియదు అని ఆమె అన్నారు.

మే నెలలో వీటికి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అనుమతులు ఇచ్చింది. ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా దోమలను జన్యుపరంగా మార్పు చేశారు. మామూలు దోమల్లో ఉన్నట్టుగా ఇందులో బ్యాక్టీరియా, వైరస్ లు ఉండవు. జన్యువుల్లో మార్పులు చేసి హ్యూమన్ ఫ్రెండ్లీ దోమలను తయారు చేశారు. ఈ దోమలు మనిషిని కుట్టినా ఏమి కాదు, హ్యూమన్ ఫ్రెండ్లీ మగదోమలు ఆడదోమలతో సంపర్కం చెందిన తరువాత ఆడదోమలు గుడ్లు పెడతాయి. అయితే, ఈ గుడ్ల నుంచి వచ్చే లార్వా దోమగా మార్పు చెందకుండానే మరణిస్తుంది. దీంతో దోమల వ్యాప్తి తగ్గిపోతుంది అని అధికారులు చెబుతున్నారు. ఈ దోమలకు OX5034 అన్న పేరును పెట్టారు.

హ్యారిస్ కౌంటీలో కూడా దోమలను వదలడానికి నిర్ణయాన్ని తీసుకున్నారు. 2021 ఏడాది మొదట్లో వీటిని వదలనున్నారు. ఆక్సిటెక్ సంస్థ ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజాన్ని(జిఎంఓ) రూపొందించింది. దోమలలో ఈ మార్పులు జరగడానికి చాలా మంది.. ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నారని ఆక్సిటెక్ సిఈఓ గ్రే ఫ్రాడ్సెన్ తెలిపారు. డెంగ్యూ, జీకా, ఎల్లో ఫీవర్... ఇలాంటి ఎన్నో రోగాలను అరికట్టవచ్చని చెబుతున్నారు. ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో దోమల కారణంగా ఇబ్బందులు పడుతున్నారని.. తాము జన్యుపరంగా మార్పు చేసిన దోమల ద్వారా ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చని తెలిపారు.

Next Story