రోహిత్‌కు ఏమైంది..? నిజం చెప్పాల‌న్న గ‌వాస్క‌ర్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Oct 2020 1:41 PM IST
రోహిత్‌కు ఏమైంది..? నిజం చెప్పాల‌న్న గ‌వాస్క‌ర్‌

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)లో ముగిసిన వెంట‌నే భార‌త జ‌ట్టు ఆసీస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. దాదాపు మూడు నెల‌ల సుదీర్ఘ ప‌ర్య‌ట‌న‌లో భార‌త జ‌ట్టు ఆసీస్‌తో మూడు వ‌న్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడ‌నుంది. ఇరు జ‌ట్ల మ‌ధ్య తొలి మ్యాచ్ న‌వంబ‌ర్ 27న ఆరంభం కానుంది. ఇదిలా ఉంటే.. ఆసీస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లే భార‌త జ‌ట్టును బీసీసీఐ సోమ‌వారం ప్ర‌క‌టించింది. ఈ జ‌ట్టులో భార‌త స్టార్ బ్యాట్స్‌మెన్‌, ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మకు చోటు ద‌క్క‌లేదు. గాయం కార‌ణంగానే అత‌డిని ఎంపిక చేయ‌లేద‌ని బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ‌

దుబాయ్‌లో జ‌రుగుతున్న ఐపీఎల్‌లో రోహిత్ ముంబై ఇండియ‌న్స్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. ఈ నెల 18న పంజాబ్‌తో మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ గాయ‌ప‌డ్డాడు. ఆ మ్యాచ్‌లో గాయంతోనే సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్ చేసిన రోహిత్.. ఆ తర్వాత ఫీల్డింగ్‌కు రాలేదు. రోహిత్ తొండ కండరాలకి గాయమైందని, తర్వాత మ్యాచ్‌కి అందుబాటులో ఉంటాడని చెప్పుకొచ్చారు. ఆత‌రువాత ముంబై రెండు మ్యాచ్‌లు ఆడిన‌ప్ప‌టికి.. రోహిత్ ఈ మ్యాచుల్లో ఆడ‌లేదు.

ఆసీస్ ప‌ర్య‌న‌ట‌కు రోహిత్‌ను ఎంపిక చేయ‌క‌పోవ‌డంతో.. ప‌లు సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. రోహిత్ గాయంపై ముంబై ఇండియన్స్, భారత సెలక్టర్లు స్పష్టమైన సమాచారం చెప్పకపోవడంపై భారత దిగ్గజ క్రికెటర్, కామెంటేటర్‌ సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. రోహిత్ శర్మకు ఏమైందో తెలుసుకునే అర్హత ప్రతి భారత క్రికెట్ అభిమానికి ఉందని.. బీసీసీఐని, ముంబై మేనేజ్‌మెంట్‌ను నిల‌దీయాల‌న్నారు.

'రోహిత్ శర్మ ఆదివారం నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అతనికి ఎలాంటి గాయమైందో? నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే రోహిత్ ఫ్యాడ్స్‌ కట్టుకుని ప్రాక్టీస్ ఎలా చేస్తాడు. చిన్న గాయమే అనుకుంటే.. ఆస్ట్రేలియా‌తో టీ20, వన్డే సిరీస్‌లో పక్కన పెట్టొచ్చు. డిసెంబరు 27 నుంచి ప్రారంభమయ్యే టెస్టులకి అవకాశం కల్పించొచ్చు. ఎందుకంటే రోహిత్ ఫిట్‌నెస్ సాధించడానికి దాదాపు నెలన్నర సమయం ఉంది. అది జరగలేదు' అని అన్నారు.

రోహిత్ శర్మకి ఏమైందనే విషయం కనీసం ఇప్పటికైనా ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్, బీసీసీఐ అధికారులు నిజాయతీగా చెప్పాలన్నారు. రోహిత్ గాయం తీవ్ర‌త గురించి అభిమానుల‌కు తెలుసుకునే అర్హ‌త ఉంద‌ని, అంత‌గా దాయాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ప్ర‌శ్నించారు. మ‌రీ గ‌వాస్క‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు బీసీసీఐ గానీ, ముంబై ఇండియ‌న్స్ మేనేజ్‌మెంట్ గానీ స్పందిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

Next Story