విశాఖ: ఎల్‌జీ పాలిమర్స్‌లో మరోసారి గ్యాస్‌ లీక్‌..అవి వ‌దంతులేనంటున్న‌ అధికారులు

By సుభాష్  Published on  7 May 2020 7:46 AM GMT
విశాఖ: ఎల్‌జీ పాలిమర్స్‌లో మరోసారి గ్యాస్‌ లీక్‌..అవి వ‌దంతులేనంటున్న‌ అధికారులు

విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమలో రసాయన వాయువు లీకైన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ రసాయన వాయువు లీకవడంతో రోడ్లపై వెళ్తున్న వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అధికారులు అప్రమత్తమైన వారిని ఆస్పత్రిలో చేర్చగా, ఇప్పటి వరకూ 10 మంది మృతి చెందగా, చాలా మంది వరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే లీకైన గ్యాస్‌ను అరికట్టినా మరోసారి లీక్‌ కావడంతో మరింత భయాందోళన నెలకొంది.

పరిసర ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లివాలని అధికారులు సూచిస్తున్నారు. దీంతో చుట్టుపక్కల ఉన్నవారు పరుగులు తీస్తున్నారు. కాగా, ప్రస్తుతానికి గ్యాస్‌ లీక్‌ ఆగిపోయిందని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రకటించిన కొద్దిసేపటికే మరోసారి గ్యాస్‌ లీక్‌ అయినట్లు ఆందోళన చెందారు. అయితే మరోసారి గ్యాస్ లీక్ అయినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవి వదంతులు మాత్రమేనని అధికారులు అంటున్నారు. గ్యాస్‌ లీకేజీలు నిలిచిపోయాయని, మరోసారి గ్యాస్‌ లీకేజీ వార్తలను కొట్టిపారస్తున్నారు. మనుషులే కాకుండా మూగజీవాలు సైతం మృత్యువాత పడుతున్నాయి. తీవ్ర అస్వస్థతకు గురైన వారు దీర్ఘకాలికంగా బాధపడే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కాగా,రోడ్డుపై వెళ్తున్నవారు ఎక్కడికక్కడే సొమ్మసిల్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మృతి చెందిన వారిలో ఇద్దరు కళ్లు కనిపించకపోవడంతో కాలువలో పడి మృతి చెందారు. అందులో ఓ చిన్నారి కూడా ఉంది. అంతేకాదు మూగ జీవాలు సైతం ఈ విష వాయువు పీల్చి తీవ్ర అస్వస్థతకు గురవుతున్నాయి. కుక్కలు, గేదెలు, ఇతర మూగ జీవాలు సైతం ఎక్కడికక్కడే తీవ్ర అస్వస్థతకు గురై పడిపోతున్నాయి.

అయితే ఈ విష వాయువు పీల్చిన ప్రజలను హుటాహుటిన పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిశ్రమ ఉన్న పరిసర ప్రాంతాల్లో 5 గ్రామాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మూడు కిలోమీటర్ల మేర ఈ విష వాయులు వ్యాపించింది.

Next Story
Share it