విశాఖ: గ్యాస్ లీక్ కావడానికి అసలు కారణం ఇదే..!
By సుభాష్ Published on 7 May 2020 12:37 PM ISTవిశాఖలో ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనలో మరణమృదంగం కొనసాగుతోంది. గురువారం తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో ఈ రసాయన వాయువులు లీక్ కావడంతో మృతుల సంఖ్య పెరిగిపోతోంది. దాదాపు 2వేలమంది వరకూ ఆస్పత్రి పాలయ్యారు. ఇప్పటి వరకూ 10 మంది మృతి చెందారు.
అయితే ఈ ప్రమాదానికి ఎల్‌జీ పాలిమర్స్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. లాక్‌డౌన్ సమయంలో పరిశ్రమలో ప్రతిరోజూ మెయింటెనెన్స్ చేయాల్సి ఉన్నప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
కాగా, కంపెనీలో మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం పాస్‌లు కూడా జారీ చేసింది. 45 మందికి పాస్‌లు ఇచ్చినప్పటికీ ఎల్జీ యాజమాన్యం నిర్లక్ష్యం వహించింది.
2వేల మెట్రిక్ టన్నుల స్ట్రెరెన్ నిల్వ
పరిశ్రమలో ఉన్న ట్యాంకుల్లో దాదాపు 2వేల మెట్రిక్ టన్నుల స్ట్రెరెన్‌ను నిల్వ చేసింది. అయితే పరిశ్రమలో 20 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత ఉండటంలో యాజమాన్యం విఫలమైంది. ఉష్ణోగ్రత పెరిగిపోవడంతో రసాయనం లీకై మంలు చెలరేగాయి. దీంతో పరిశ్రమ ఉన్న పరిసర ప్రాంతాల్లో వాయువు వేగంగా వ్యాపించింది.
నాడు భోపాల్.. నేడు విశాఖ
1984లో అర్దరాత్రి సమయంలో గ్యాస్ లీకేజీ కావడం వల్ల దాదాపు 4వేల మంది వరకు మృత్యువాత పడ్డారు. యూనియన్ కార్బయిడ్ రసాయనాల కర్మాగారం నుంచి భారీ మొత్తంలో వ్యాపించిన విష వాయువు లీకేజీ కావడం వల్ల 24 గంటల్లోనే 3వేల మందికిపైగా మృత్యువాత పడ్డట్లు అంచనా. ఆ తర్వాత మరో వెయ్యికి పైగా మరణించారు. అక్కడ కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే జరిగితే ఇప్పుడు విశాఖలో కూడా అదే జరిగింది. ఎల్జీ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి అద్దం పడుతోంది.