మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిషోర్‌ మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 July 2020 7:48 AM GMT
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిషోర్‌ మృతి

ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిషోర్‌ శనివారం ఉదయం విశాఖలో మృతి చెందారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యలు చెబుతున్నారు. అయితే ఆయ‌న‌కు క‌రోనా వైర‌స్ నిర్ధార‌ణ అయిన‌ట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో అధికార పార్టీకి వ్యతిరేక పోస్టులు పెట్టారన్న కారణంతో సీఐడీ పోలీసులు ఇటీవల ఆయన్ను అరెస్టు చేసి కర్నూలు తీసుకెళ్లి విచారించారు. దీంతో టీడీపీ నేతలు ఆయన అరెస్టు పై భగ్గుమన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో అరెస్ట్‌ చేయడం ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నించారు. తప్పుడు కేసులు పెట్టారని మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌ ప్రభుత్వం పై మండిపడ్డారు. ఆ తర్వాత ఆయనకు బెయిల్‌ రావడంతో విడుదలయ్యారు.

కిషోర్ మృతి పట్ల గంటా శ్రీనివాసరావు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు నలంద కిషోర్ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కిషోర్‌ మృతి తనను ఎంతగానో బాధించిందని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. నలంద కిషోర్‌ ది ముమ్మాటికి పోలీసు హత్యేనని ఆరోపించారు. సోషల్ మీడియాలో కిషోర్‌ పెట్టిన పోస్టుల్లో ఎవరి పేర్లు లేకపోయినా.. పోలీసులు అరెస్టు చేశారని, ఆరోగ్యం బాగా లేకున్నా విశాఖ నుంచి కర్నూలుకు కారులో తరలించారన్నారు. కిషోర్‌ను తరలించిన సమయంలో కర్నూలులో కరోనా కేసులు ఉద్దృతంగా ఉన్నాయని.. కరోనాతోనే కిషోర్‌ చనిపోయినట్లు తెలుస్తోందన్నారు. ఆయన్ను కావాలనే కర్నూలు తీసుకెళ్లి కరోనా అంటించారని, ఇది ముమ్మాటికీ పోలీసు హత్యగానే భావించాలన్నారు.

Next Story