దీదీపైకి మోదీ సంధించే బాణం.. దాదానేనా?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Aug 2020 11:18 AM ISTపలు రంగాలకు చెందిన ప్రముఖుల్ని బీజేపీకి దగ్గరకు చేస్తున్న మోడీ.. తాజాగా భారీ ప్లాన్ వేశారా? ముక్కుసూటిగా..తన ఆవేశంతో మిగిలిన వారితో పోలిస్తే.. సో.. స్పెషల్ గా కనిపిస్తూ.. క్రికెట్ క్రీడా రంగంలో తనదైన ముద్రవేసిన ఆటగాడిగా సౌరవ్ గంగూలీకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా అతగాడు.. బీజేపీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నట్లుగా చెబుతున్నారు.
వచ్చే ఏడాది పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈసారి బెంగాల్ పీఠాన్ని ఏలాగైనా సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో మోడీషాలు ఉన్నారు. ఇందులో భాగంగా బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విషయలో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు బెంగాల్ ను టార్గెట్ చేసి మరీ.. ఫెయిల్ అయిన మోడీషాలు.. ఈసారి మాత్రం భారీకసరత్తునే చేస్తున్నట్లు చెబుతున్నారు.
త్వరలోనే బీజేపీలోకి మాజీ క్రికెటర్ కమ్ బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామం కూడా ఇందుకు బలాన్ని చేకూరుస్తుందన్న మాట వినిపిస్తోంది. గంగూలీ సారథ్యంలోని ట్రస్టు ఒకటి కోల్ కతాలో ఒక స్కూల్ నుస్టార్ట్ చేయాలనుకుంది. ఇందులో భాగంగా ఈశాన్య కోల్ కతాలోని అతి ఖరీదైన న్యూటౌన్ ప్రాంతంలో గంగూలీ ట్రస్టుకు దీదీ సర్కారు రెండు ఎకరాల్ని కేటాయించింది.
ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ స్థలానికి సంబంధించి ఒక వివాదంలో చిక్కుకోవటం.. కోర్టుకువెళ్లాల్సిన రావటంపైన గంగూలీ గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో.. ఈ భూమిని.. దాని తాలుకూ వచ్చిపడ్డ వివాదాన్ని వదిలించుకునేందుకు గంగూలీ తాజాగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతను కలిసిన సౌరవ్.. తమకు కేటాయించిన భూమిని తిరిగి ఇచ్చేసిన వైనాన్ని ఆమెకు చెప్పినట్లుగా చెబుతున్నారు.
అనంతరం.. సౌరవ్ తిరిగి ఇచ్చేసిన భూమిని.. ప్రభుత్వం ఆమోదం తెలపటం గమనార్హం. ఈ మొత్తం ఎపిసోడ్ సౌరవ్ ను బాధించిందని.. అందుకే ఆయన బీజేపీలోకి రావటం ద్వారా.. రాష్ట్ర రాజకీయాల్ని మార్చాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. బెంగాల్ కు సంబంధించినంత వరకు ప్రజల్లో చక్కటి ఆదరణ ఉన్న నేత తమకు లేరనే దిగులు సౌరవ్ ఎంట్రీతో పోతుందంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలోకి సౌరవ్ ఎంట్రీ దాదాపు ఖాయమన్న మాటలు ఇటీవల కాలంలో మరింత బలంగా వినిపిస్తున్నాయి.