మధ్యప్రదేశ్‌లో దారుణం.. యువతిపై ఏడుగురి అఘాయిత్యం
By తోట వంశీ కుమార్ Published on 2 May 2020 1:51 PM IST
మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. సోదరుడితో కలిసి పెట్రోల్ బంకు వెళ్లిన యువతి పై ఏడుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. లాక్‌డౌన్ కారణంగా నేరాల రేటు తగ్గుతుందని బావిస్తున్న తరుణంలో ఈ ఘటన కలకలం సృష్టించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాధార్ సమీప గ్రామానికి చెందిన యువతి(19) బుధవారం సాయంత్రం తన సోదరుడితో కలిసి పెట్రోలు బంక్‌కు వెళ్లింది. బైక్‌లో పెట్రోలు పోయించుకుని తిరిగి వస్తుండగా.. బైక్ హెడ్ లైట్ పనిచేయలేదు. బైక్‌ను పక్కకు ఆపి ఆ యువకుడు హెడ్‌లైట్ సరిచేయడం ప్రారంభించారు. ఇంతలో వెనుక నుంచి రెండు ద్విచక్రవాహానాలపై ముగ్గురు యువకులు వచ్చి యువతి సోదరుడిపై దాడికి పాల్పడ్డారు. అతడిని పక్కనే ఉన్న బావిలో పడేసి.. ఆ యువతిని సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడికి మరో నలుగురు వచ్చారు. మొత్తం ఏడుగురు కలిసి ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు.
ఎలాగోలా ఆ బావి నుంచి బయటపడిని ఆ యువకుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు యువతి ఆ చుట్టు ప్రక్కల వెతికకగా.. ఓ చోట యువతి అపస్మారక స్థితిలో కనిపించింది. యువతిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు మైనర్లు ఉన్నారని తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని త్వరలోనే వారిని పట్టుకుంటామని చెప్పారు.