ఆస్తి ఎవరిదైనా సరే.. మేం చేసేదే రిజిస్ట్రేషన్‌.!

By అంజి  Published on  5 Feb 2020 1:48 PM IST
ఆస్తి ఎవరిదైనా సరే.. మేం చేసేదే రిజిస్ట్రేషన్‌.!

హైదరాబాద్‌: మేం తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతామని రాష్ట్ర రిజిస్ట్రేషన్‌ అధికారులు మరోసారి నిరూపించుకున్నారు. ఆస్తి ఎవరిదైనా సరే.. దానికి సంబంధించిన వివరాలను ఎవరి పేరు మీద నమోదు చేస్తే వారిదే ఆస్తి అన్నట్లుగా రిజిస్ట్రేషన్‌ అధికారులు వ్యవహరిస్తున్నారు. చనిపోయిన వ్యక్తులతోనూ అధికారులు అక్రమాలు చేస్తున్నారు. తాజాగా అధికారుల పనితీరుకు అద్దంపట్టే ఘటన గండిపేట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వెలుగులోకి వచ్చింది.

రాజేంద్రనగర్‌లోని బండ్లగూడ జాగీర్‌లో సర్వే నెంబర్లు 96/2, 96/3లో ప్లాట్‌ నెం.బీ-147లో 300 గజాల స్థలం ఉంది. ఈ భూమిని 1989లో ఎ.జగన్‌ సింగ్‌ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. ఆ వ్యక్తి 2005లో మృతి చెందాడు. ప్రస్తుతం ఇక్కడ గజం భూమి రూ.45 వేల నుంచి 50 వేలు పలుకుతోంది. అయితే ఈ భూమిపై అక్రమార్కుల కన్నుపడింది. భూమిని కాజేసేందుకు నకిలీ ఆధార్‌ను సృష్టించారు. జగన్‌సింగ్‌గా మరో వ్యక్తిని చూపిస్తూ రూ.కోటిన్నర పలికే ఆ భూమిని గండిపేట రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో 2019 జూన్‌ 29న రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఇప్పుడు మృతుడు జగన్‌సింగ్‌ కుమారుడు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

భూమి రిజిస్ట్రేషన్‌ సమయంలో కొనుగోలుదారులు, విక్రయదారుల ఆధార్‌కార్డునుల సబ్‌రిజిస్ట్రార్లు తనిఖీలు చేస్తారు. ఆధార్‌ను తనిఖీ చేసిన అధికారికి ఎదురుగా ఉన్న నకిలీ జగన్‌ సింగే అందులో కనిపించాడు. అయితే ఏదైనా భూ రిజిస్ట్రేషన్‌ సమయంలో వీడియో రికార్డింగ్‌ చేయాలి.. కానీ అక్కడ అలా జరగలేదని అధికారి చెబుతున్నాడు. రిజిస్ట్రేషన్‌ సమయంలో పాన్‌కార్డులను సబ్‌రిజిస్ట్రార్‌ తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. బాధితుల ఫిర్యాదుతో విషయం తెలుసుకున్న సబ్‌ రిజిస్ట్రార్‌ జనవరి 3న నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నకిలీ ఆధార్‌తో భూమి రిజిస్ట్రేషన్‌ ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఐజీ చిరంజీవులు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

Next Story