గాంధీలో కరోనా పాజిటివ్ రోగి మృతి.. డాక్టర్లపై దాడి చేసిన మృతుడి సోదరుడు

By సుభాష్  Published on  1 April 2020 5:07 PM GMT
గాంధీలో కరోనా పాజిటివ్ రోగి మృతి.. డాక్టర్లపై దాడి చేసిన మృతుడి సోదరుడు

కరోనా వైరస్ ధాటికి గాంధీ ఆసుపత్రిలో మరొకరు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ వల్ల చనిపోయిన వారి సంఖ్య 7కు చేరుకుంది. అయితే.. రోగి మృతి చెందాడని వైద్యులు నిర్ధారించడంతో.. అదే వార్డులో చికిత్స పొందుతున్న అతని సోదరుడు వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. దాడి చేసినట్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్ శ్రవణ్‌ కుమార్ తెలిపారు. అయితే మృతిచెందిన రోగితో పాటు అతని సోదరుడు ఇటీవల డిల్లీ వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. అతడు కూడా ప్రస్తుతం గాంధీలో చికిత్ప పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌ గాంధీ ఆసుపత్రికి చేరుకుని అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

Also Read

ఇక ఈ విషయమై స్పందించిన మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. గాంధీ హాస్పిటల్ లో డాక్టర్ ల పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితులలో క్షమించమని.. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

డాక్టర్లు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతుంటే వారిని కొట్టడం ఏంటి? ప్రశ్నించారు. డాక్టర్స్ మీద దాడి చేయడం హేయమైన చర్య అనీ.. ఇలాంటి గంభీరమైన సమయంలో ఇలాంటి ఘటనలు మంచిది కాదని అన్నారు. 24 గంటలు డాక్టర్లు ప్రజల కోసం పని చేస్తున్నారని.. వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రతి డాక్టర్ కి రక్షణ కల్పిస్తామని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామి ఇచ్చారు.

Next Story