మరో మారు మానవత్వం చాటుకున్న గంభీర్
By తోట వంశీ కుమార్ Published on 24 April 2020 4:46 PM ISTటీమ్ఇండియా మాజీ ఆటగాడు, తూర్పు ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ తన మంచి మనసు చాటుకున్నాడు. తన ఇంట్లో పనిచేస్తున్న సహాయకురాలి అంత్యక్రియలను దగ్గరుండి మరీ జరిపించాడు. పైగా, ఆమె మా ఇంటి పనిమనిషికాదనీ.. తమ కుటుంబ సభ్యురాలు అంటూ ట్వీట్ చేసి తనలోని మానవత్వాన్ని నిరూపించుకున్నాడు.
సరస్వతి పాత్ర ఆరేళ్లులుగా గంభీర్ ఇంట్లో సహాకురాలిగా పని చేస్తోంది. గత కొంతకాలంగా ఆమె మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతోంది. ఇటీవల ఆస్పత్రిలో చేరిన ఆమె.. చికిత్స పొందుతూ మృతి చెంది. ఆమె కుటుంబ సభ్యులు ఒడిశాలో ఉంటారు. ప్రస్తుతం లాక్‌డౌన్ నేపధ్యంలో ఆమె మృతదేహాన్ని ఒడిశాకు పంపలేని పరిస్థితి. దీంతో గంభీర్ స్వయంగా అంత్యక్రియలను నిర్వహించాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించాడు.
“నా పిల్లలను జాగ్రత్తగా చూసుకున్న ఆమె ఎప్పటికీ పని మనిషికాదు. ఆమె నా కుటుంబ సభ్యురాలు. ఆమె అంత్యక్రియలు నిర్వహించడం నా బాధ్యత. కులం, మతం, ప్రాంతం, సామాజిక పరిస్థితులతో సంబంధం లేకుండా అందరినీ గౌరవించాలని నేను ఎప్పుడూ నమ్ముతాను. అదే నా దేశం ఆలోచన. ఓ శాంతి” అని గంభీర్ ట్వీట్ చేశాడు.
కేంద్ర మంత్రి ధర్మేద్ర ప్రదాన్ గంభీర్ చర్యను ప్రశంసించారు. ఇంట్లో పనిచేసే వారిని తన మనిషిగా చూడటమేకాకుండా ఆమె అంత్యక్రియలు కూడా నిర్వహించడం గంభీర్ గొప్పతనమని, ఆయన మానవతా దృష్టికి నిదర్శనమని అన్నారు. ప్రస్తుతం గంభీర్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇక కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరులో తమ వంతు సాయంగా గంభీర్ రెండేళ్ల వేతనాన్ని ప్రధాన మంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.