వ‌చ్చే సీజ‌న్‌కు ఎన్ని మార్పులు చేసినా.. కెప్టెన్ మాత్రం అత‌నే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Oct 2020 9:23 AM GMT
వ‌చ్చే సీజ‌న్‌కు ఎన్ని మార్పులు చేసినా.. కెప్టెన్ మాత్రం అత‌నే..!

చెన్నై సూపర్‌ కింగ్స్.. గ‌త సీజ‌న్ వ‌ర‌కూ ఐపీఎల్‌లో తిరుగులేని జ‌ట్టు.‌ ఈ సారి పేలవ ప్రదర్శనతో ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌కు దూరమైంది. అయితే వచ్చే ఏడాది సీఎస్‌కే భ‌విత‌వ్యంపై అప్పుడే చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. ధోనీ ఉంటాడా.. త‌ప్పుకుంటాడా.. అనే విష‌య‌మై తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేఫ‌థ్యంలో టీమిండియా మాజీ ఆట‌గాడు గౌత‌మ్ గంభీర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు.

వ‌చ్చే సీజ‌న్‌లో కూడా ఎంఎస్‌ ధోనినే సీఎస్‌కే జట్టు కెప్టెన్‌గా కొనసాగవచ్చని‌ అభిప్రాయం వ్య‌క్తం చేశాడు. అంతేకాకుండా.. ధోనికి, సీఎస్‌కే‌ మేనేజ్‌మెంట్‌కు మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధం అలాంటిదని అతను వ్యాఖ్యానించాడు. రెండు వైపులనుంచి పరస్పర గౌరవం ఉంటేనే ఇది సాధ్యమవుతుందని గంభీర్‌ అన్నాడు.

ఐపీఎల్‌ ప్రారంభమైన నాటినుంచి సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ ధోనికి పూర్తి స్వేచ్ఛనిచ్చిందని.. దానికి తగినట్లుగానే అతను అద్భుత ఫలితాలు సాధించి చూపించాడని అన్నాడు. జట్టు కోసం ధోనీ ఎంతో చేశాడని.. కాబట్టి మరోసారి ధోనీని చెన్నై కెప్టెన్‌గా కొనసాగించడంలో ఆశ్చర్యం లేదని అన్నాడు.

అతనికి మేనేజ్‌మెంట్‌పై, మేనేజ్‌మెంట్‌కు ధోనిపై ఉన్న పరస్పర గౌరవం, అనుబంధమే అందుకు కారణమ‌ని అన్నాడు. ఆటలో భావోద్వేగాలకు చోటు లేదు అనే మాటలు చెప్పడం సులువే కానీ.. ఆ దగ్గరితనాన్ని ఎవరూ కాదనలేరని.. 2021 సీజ‌న్‌కు ప్రస్తుత జట్టులో ఉన్న‌వారని త‌ప్పించి చాలా మార్పులు చేసినా కెప్టెన్‌గా మాత్రం ధోనీనే ఉంటాడని నేను నమ్ముతున్నాని గంభీర్ త‌న అభిప్రాయాన్ని తెలిపాడు.

Next Story