ఐపీఎల్ 2021 సీజన్‌కు‌ చెన్నై జ‌ట్టులో భారీ మార్పులు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Oct 2020 12:06 PM GMT
ఐపీఎల్ 2021 సీజన్‌కు‌ చెన్నై జ‌ట్టులో భారీ మార్పులు..!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)లో అత్యంత విజ‌య‌వంమైన జ‌ట్టు ఏదైనా ఉందంటే అది చెన్నై సూప‌ర్‌కింగ్స్ మాత్ర‌మే. ఈ సీజ‌న్‌ను మిన‌హాయిస్తే ఐపీఎల్‌లో ప్ర‌తి సీజ‌న్‌లోనూ చెన్నై జ‌ట్టు ప్లే ఆఫ్స్ చేరింది. ఈ సీజ‌న్‌లో చెన్నై జ‌ట్టుకు ఊహించ‌ని ప‌రాజ‌యాలు ఎదుర‌య్యాయి. 12 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు మాత్రమే సాధించిన చెన్నై పాయింట్ల పట్టికలో అట్ట‌డుగు స్థానంలో ఉంది. రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ప్లేఆఫ్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది.

దీంతో ధోని సార‌ధ్యంపై సందేహాలు వెల్లువెత్తాయి. ఓట‌ముల‌కు ధోనినే కార‌ణ‌మ‌ని, ఫామ్‌లో లేని సీనియర్ ఆటగాళ్లకు పదే పదే అవకాశాలిచ్చి మూల్యం చెల్లించుకున్నాడని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు విమర్శలు గుప్పించారు. ఇక ఐపీఎల్‌కు కూడా ధోని గుడ్‌బై చెప్ప‌నున్నాడు అనే వార్త‌లు వినిపించాయి. అయితే.. చెన్నై అభిమానుల‌కు నిజంగా శుభ‌వార్త ఇది. వ‌చ్చే సీజ‌న్ 2021లో కూడా చెన్నై జ‌ట్టుకు ధోనినే సార‌థ్యం వ‌హిస్తాడంటూ సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వ‌నాథ‌న్ వెల్ల‌డించారు.

ఆటలన్నాక గెలుపోటములు సహజమని అంత మాత్రాన ధోనీని కెప్టెన్సీ నుంచి తప్పించడం వుండదని ఆయన తెలిపారు. మూడు సార్లు జట్టును ఐపీఎల్ విజేతగా నిలిపిన ఘనత ధోనీకి వుందని, అంతే గాక సీఎస్కేను మరో అయిదు సార్లు ఫైనల్‌కు చేర్చాడని కాశీ విశ్వనాథన్ చెప్పుకొచ్చారు.

కాశీ విశ్వనాథన్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఖ‌చ్చితంగా.. ఐపీఎల్ 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుకు ఎంఎస్ ధోనీ నాయకత్వం వహిస్తాడని మాకు గట్టి నమ్మకం ఉంది. చెన్నైకి మహీ మూడు టైటిల్స్‌ అందించాడు. తొలిసారి చెన్నై ప్లేఆఫ్‌కి అర్హత సాధించలేకపోయింది. ఐపీఎల్‌లో ఏ జట్టు కూడా ఆడిన ప్రతి సీజన్‌లోనూ ప్లేఆఫ్‌కి చేరలేదు. ఏదో ఒక సీజన్‌లో ఫెయిలైనంత మాత్రానా అన్నీ మార్చేస్తారనుకోవడం పొరపాటు. చెన్నై జట్టు ఈ సీజన్లో సామర్థ్యానికి తగినట్టు ఆడలేదు. కొన్ని గెలవాల్సిన మ్యాచులను కోల్పోయాం. అదే చెన్నైని వెనకపడేలా చేసింది. చివరకు మూల్యం చెల్లించుకున్నాం. సురేష్ రైనా, హర్భజన్ సింగ్ టోర్నీ నుంచి తప్పుకోవడం.. యూఏఈ చేరగానే జట్టులో సభ్యుల‌కు కరోనా సోకడం లాంటివి జట్టు సమతుల్యతను దెబ్బతీశాయి' అని కాశీ విశ్వనాథన్ పేర్కొన్నారు.

చెన్నై జట్టుని ఇప్పటికే డాడీస్ ఆర్మీగా పిలుస్తున్నారు. ఆ జట్టులో అందరూ 30 ఏళ్లకు పైబడినవారే. ఎవరూ అంతగా రాణించట్లేదు. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్‌ కోసం జట్టులో భారీ మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకొని వయసు మీద పడిన వారికి ఉద్వాసన పలుకుతారని ప్రచారం జరుగుతోంది.

Next Story