మరోసారి సొంతగూటికి చేరిన కాకా తనయుడు..!
By అంజి Published on 11 Jan 2020 8:40 PM IST
ఢిల్లీ: మాజీమంత్రి, టీఆర్‌ఎస్ నేత గడ్డం వినోద్ సొంత గూటికి చేరుకున్నారు. శనివారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో వినోద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని వినోద్ తెలిపారు. 35 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉందని, కాంగ్రెస్ తమ సొంత పార్టీ అని పేర్కొన్నారు. నాన్న వెంకటస్వామి ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చానని వినోద్ తెలిపారు. గత ఎన్నికల్లో కొన్ని కారణాలతో ఇండిపెండెంట్‌గా పోటీ చేశానన్నారు.
చెన్నూరు నియోజవర్గం నుంచి టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి వినోద్ ఓడిపోయారు. చెన్నూరు బాల్క సుమన్ టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి గెలుపోందారు. మొదట టీఆర్‌ఎస్ నుంచి టికెట్ వస్తుందనుకున్నా వినోద్ అనుకున్నారు. తీరా వినోద్‌కు టికెట్ ఇవ్వకుండా అతడి ఆశలను టీఆర్‌ఎస్ నీరుగార్చింది. దీంతో వినోద్ రెబల్‌గా పోటీ చేసి ఓటమి చెందాడు. అయితే సోదరుడు వివేక్ బీజేపీలో చేరడం ఆయన వ్యక్తిగతమని వినోద్ తెలిపారు. వివేక్ ఆలోచన వేరు, తన ఆలోచన వేరన్నారు.
2013లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో వినోద్, వివేక్ ఇద్దరు కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత సంవత్సరం గడవకముందే తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా గడ్డం వివేక్, చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా గడ్డం వినోద్ పోటీ చేసి ఓటమి చవిచూశారు. అనంతరం కేసీఆర్ చేపట్టిన టీఆర్‌ఎస్ ఆకర్ష్‌తో 2016లో ఇద్దరూ మరోసారి టీఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇద్దరు సోదరులకు టికెట్లు ఇవ్వకుండా టీఆర్‌ఎస్ అధిష్టానం మొండి చేయి చూపించింది. పార్టీలో సరైన గుర్తింపు లభించలేదన్న కారణంతో వివేక్ బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వినోద్ మాత్రం టీఆర్‌ఎస్ రెబెల్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.