హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. మరో ఫ్లైఓవర్ ప్రారంభం
By సుభాష్ Published on 21 May 2020 11:27 AM ISTహైదరాబాద్ నగరం అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది ట్రాఫిక్. సిటీలో ఎక్కడికెళ్లాలన్నా.. గంటల తరబడి ప్రయాణం. ట్రాఫిక్‌లో చిక్కుకున్నామంటే అంతే సంగతి. నగరంలో ట్రాఫిక్ కష్టాలు అన్నీ.. ఇన్నీ కావు. మెట్రో వస్తే ట్రాఫిక్ తగ్గుతుందనుకుంటే ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే తాజాగా హైదరాబాద్ నగర వాసులకు జీహెచ్‌ఎంసీ శుభవార్త చెప్పింది గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వైపు వెళ్లే వాహనదారులకు ఇక ట్రాఫిక్ కష్టాలు తొలగనున్నాయి. బయోడైవర్సిటీ జంక్షన్‌లో నిర్మించిన ఫస్ట్ లెవల్ ఫ్లై ఓవర్‌ను రాష్ట్ర మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఎస్‌ఆర్‌డీపీ ప్యాకేజీ కింద రూ.379 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన జెఎన్‌టీయు నుంచి బయోడైవర్సిటీ వరకూ 12 కిలోమీటర్ల కారిడార్ పనులు పూర్తవుతాయని ఆయన పేర్కన్నారు.ఈ ప్యాకేజీలో భాగంగా ఇప్పటి వరకూ ఐదు పనులు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు.
మైండ్ స్పేస్ అండర్ పాస్, మైండ్‌స్పేస్ ఫ్లైఓవర్, అయ్యప్ప సొసైటి జంక్షన్ అండర్ పాస్, రాజీవ్‌గాంధీ జంక్షన్ ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ జంక్షన్ లెవల్ -2 ఫ్లైఓవర్లను గతంలోనే ప్రారంభించామని తెలిపారు. ఈ ఫ్లై ఓవర్ పూర్తయితే గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వైపు రాయదుర్గ్ వెళ్లే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని తెలిపారు.
రూ.30 కోట్లతో మొదటి దశ పనులు పూర్తి
కాగా, రూ. 30.26 కోట్లతో మొదటి దశ ఫ్లై ఓవర్ పనులు పూర్తయినట్లు చెప్పారు. దీని పొడవు 690 మీటర్లు, 11.50 మీటర్లు ఉన్నట్లు తెలిపారు. మూడు లైన్లు ఉండే ఈ ఫ్లై ఓవర్‌పై అన్ని రకాల వాహనాలను అనుమతించనున్నట్లు చెప్పారు.