ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా
By సుభాష్ Published on 6 July 2020 9:00 AM GMTఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మళ్లీ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం.. వైఎస్‌ఆర్ జయంతి రోజున జూలై 8న ఇళ్ల పట్టాల పంపిణీ జరగాల్సి ఉండేది. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాట్లు కూడా భారీగానే చేసింది. అయితే రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ఉండటంతో ఇళ్లపట్టాల పంపిణీ చేయడం సరైంది కాదని భావించిన ప్రభుత్వం వాయిదా వేసింది. కరోనా కేసులు తగ్గుముఖం పడితే ఆగస్ట్ 15న పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సర్కార్ భావించింది. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాకముందే పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ముందు సంక్రాంతి కానుకగా ఇవ్వాలని భావించారు. తర్వాత కొన్ని కారణాల వల్ల అంబేద్కర్ జయంతికి వాయిదా వేశారు. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేశాయి. ఆ తర్వాత కరోనా, లాక్‌డౌన్ లాంటి కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇక లాక్‌డౌన్ ఎత్తివేయడంతో జూలై 8న పట్టాలు పంపిణీ చేయాలని భావించగా, ఇప్పుడు కూడా వాయిదా పడింది. ప్రస్తుతం కరోనా అధికంగా ఉండటం, పట్టాల పంపిణీ సమయంలో ప్రజలంతా ఒకేసారి గుంపులు గుంపులుగా వచ్చే అవకాశం ఉండటం, దీంతో కరోనా అధికంగా వ్యాపించే అవకాశాలు ఉండటంతో పట్టాల పంపిణీ వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం.
కాగా, నిన్న ఒక్కరోజే ఏపీలో 998 కరోనా కేసులు రాగా, 14 మంది మృతి చెందారు. ఇక ఇప్పటి వరకూ ఏపీలో 18,697 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకూ మరణాల సంఖ్య 232కు చేరుకుంది.