ఫోర్బ్స్ లిస్ట్ లో ప్రపంచ కుబేరుడిగా జెఫ్ బెజోస్

By రాణి  Published on  10 April 2020 7:30 AM GMT
ఫోర్బ్స్ లిస్ట్ లో ప్రపంచ కుబేరుడిగా జెఫ్ బెజోస్

ముఖ్యాంశాలు

  • భారతదేశ శ్రీమంతుడిగా ముఖేష్ అంబానీ
  • సంపన్నుల జాబితాలో నలుగురు తెలుగువారు
  • ఫోర్బ్స్ జాబితా నుంచి 237 మంది ఔట్

ఫోర్బ్స్ వెల్లడించిన 34వ వార్షిక బిలీనియర్ల జాబితాలో ప్రపంచ కుబేరుడిగా మళ్లీ అమెజాన్ ఫౌండర్, సీఈఓ జెఫ్ బెజోస్ స్థానం సంపాదించుకున్నారు. కరోనా వైరస్ కారణంగా అమెజాన్ ఆన్ లైన్ సేవలు నిలిచిపోయినా బెజోస్ 113 బిలియన్ డాలర్ల ఆదాయంతో ప్రపంచ సంపన్నుల్లో మొదటిస్థానాన్ని దక్కించుకున్నారు. బెజోస్ మాజీ భార్య మెకంజీ 36 బిలియన్ డాలర్ల సంపాదనతో ఫోర్బ్స్ లిస్ట్ లో 22వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇక రెండవ స్థానంలో 98 బిలియన్ డాలర్లతో బిల్ గేట్స్ ఉన్నారు.

Also Read : అన్నమాట నిలబెట్టుకున్న సల్లూభాయ్..సినీ కార్మికుల ఖాతాల్లో రూ.3 వేలు జమ

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ 36.8 బిలియన్ డాలర్ల సంపదతో దేశీయ సంపనున్నుల్లో మొదటి శ్రీమంతుడిగా నిలిచారు. ప్రపంచ కుబేరుల్లో ముకేశ్ కు 21వ స్థానం దక్కింది. కరోనా కారణంగా బిజినెస్ పడిపోయింది. ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. గతంతో పోలిస్తే అంబానీ సంపద తగ్గింది. ప్రపంచ కుబేరుల్లో స్థానం కూడా పడిపోయింది. అయినా దేశీయంగా ఆయనే టాప్ లో ఉన్నారు.

ఇక ప్రపంచ కుబేరుల జాబితా విషయానికొస్తే..ఎల్‌వీఎంహెచ్ సంస్థ సీఈవో బెర్నార్డ్ అర్నాల్ట్ 76 బిలియన్ డాలర్ల సంపదతో మూడవ స్థానంలో ఉన్నారు. 67.5 బిలియన్ డాలర్ల సంపాదనతో వారెన్ బఫెట్ నాల్గవ స్థానంలో, డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ 13.8 బిలియన్ డాలర్లతో 78వ స్థానానికి పడిపోయారు. మొత్తానికి గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 237 మంది ఫోర్బ్స్ లిస్ట్ నుంచి ఔటయ్యారు. కరోనా కారణంగా సుమారు 1000 మంది ఆస్తుల విలువ తగ్గింది. ఫోర్బ్స్ టాప్ 100 సంపన్నుల లిస్ట్ లో భారత్ నుంచి ముఖేష్ అంబానీ, దమానీలకు మాత్రమే చోటు దక్కింది. మొత్తం 2,095 మందికి ఫోర్బ్స్ ప్రపంచ సంపన్నుల జాబితాలో స్థానం దక్కింది. వీరిలో 100 మందికి పైగా భారతీయులుండగా, నలుగురు తెలుగువాళ్లు స్థానం సంపాదించుకున్నారు. దివీస్‌ లాబోరేటరీస్‌ అధినేత మురళీ దివీ 3.5 బిలియన్ డాలర్లతో, పిచ్చిరెడ్డి 1.6 బిలియన్ డాలర్లు, పీవీ కృష్ణారెడ్డి 1.6 బిలియన్ డాలర్లు, అరబిందో ఫార్మా అధిపతి పీవీ రాంప్రసాద్‌ రెడ్డి 1.4 బిలియన్ డాలర్లతో ప్రపంచ సంపన్నుల జాబితాలో నిలిచారు.

Also Read : అక్కడ కరోనాతో 11 మంది భారతీయులు మృతి

Next Story