వామ్మో.. కమలా హారిస్ కు ఈ స్థాయి ఫాలోయింగ్ ఉందా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Aug 2020 6:40 AM GMTఅమెరికా ఉపాధ్యక్ష రేసులో భారత సంతతి మహిళ కమలా హారిస్ నిలిచిన సంగతి తెలిసిందే. డెమోక్రాట్ల అభ్యర్థి జో బిడెన్, ఉపాధ్యక్ష పదవికి కాలిఫోర్నియా సెనెటర్ కమలా హారిస్ పేరును ప్రతిపాదించడం పట్ల అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు.
ఉపాధ్యక్ష పదవికి కమలా హారిస్ ను ఎంచుకున్నట్టు జో బిడెన్ ప్రకటించగా విరాళాలు భారీగా వస్తున్నాయి. కమలా హారిస్ వైస్ ప్రెసిడెంట్ అంటూ బిడెన్ ప్రకటించగానే ఒకరోజు వ్యవధిలో దాదాపు 26 మిలియన్ డాలర్ల విరాళాలు వచ్చాయి. గతంలో ఒకరోజులో సమీకరించిన విరాళాల్లో ఇది రెట్టింపు అని చెబుతున్నారు. భారీగా విరాళాలు వస్తుండడంతో డెమోక్రాట్ వర్గాలు ఆనందంలో మునిగి తేలుతున్నాయి. కాలిఫోర్నియా రాష్ట్రంలో కమలా హారిస్ కు గట్టి మద్దతుంది. అక్కడి వ్యాపారులు, ప్రముఖులు పార్టీకి భారీగా విరాళాలు ఇస్తున్నారు. భారత్, ఆఫ్రికన్ మూలాలు ఉండటం కూడా కమలా హారిస్ కు భారీ ఫాలోయింగ్ తీసుకొని వస్తోంది.
కమల హారిస్ ను ఉపాధ్యక్ష పదవికి ప్రకటించడంపై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించిన తీరు ఆడవాళ్లను కించపరిచే విధంగా ఉందని పలువురు సామాజిక మాధ్యమాల్లో చెప్పుకొచ్చారు. ఒక మహిళను ఉపాధ్యక్ష పదవికి పోటీ చేయబోయే అభ్యర్థిగా బిడెన్ ఎంచుకుకోగా.. అది కొందరు పురుషులు అవమానంగా భావించే అవకాశం ఉందని అన్నారు. బిడెన్ ఒక వర్గానికి వ్యతిరేకిగా మారిపోయారని.. పురుషులకు అవమానం జరిగిందని కొందరు అనొచ్చని ట్రంప్ చెబుతూ ఉన్నారు.