సిద్దిపేటలో పాడితే తెలంగాణంతా ఫేమస్..

By అంజి  Published on  13 Feb 2020 9:44 AM IST
సిద్దిపేటలో పాడితే తెలంగాణంతా ఫేమస్..

వయస్సు 64 ఏళ్లు. రిటైర్మెంట్ వయసు. కుక్కి మంచంలోనూ, వాలు కుర్చీ లోనో కూర్చుని “ఆ రోజుల్లో..” అంటూ పాచిపోయిన పాత కథలు తలచుకునే వయసు. పుట్టింది పెరిగింది పల్లెటూరు. ఫక్తు గ్రామీణ వాతావరణం. కానీ ఇప్పుడీ 64 ఏళ్ల “యువతి” యువ గాయని మంగ్లీకి పోటీ ఇస్తోంది. స్టేజి షోలు చేస్తోంది. సినిమాల్లో పాటలు పాడుతోంది. ఆమె పేరు గొట్టె కనకవ్వ.

పట్టుమని పది రోజుల క్రింద ఆమె సమ్మక సారలమ్మ జాతర సందర్భంగా మంగ్లీ, చరణ్ అర్జున్ లతో గొంతు కలిపి ఒక పాట పాడింది. ఆ పాట పాపులారిటీ చార్టులో పైపైకే దూసుకుపోతోంది. యాభై లక్షల వ్యూస్ దాటిపోయింది. ఆ పాటకు కనకమ్మ గొంతే హైలైట్. కనకవ్వ కు ఇది తొలి రికార్డు కాదు. మిక్ టీవీ కోసం సంక్రాంతి సందర్భంగా కూడా ఆమె ఒక పాట పాడింది.

సిద్ధిపేట జిల్లా బొడిగెపల్లికి చెందిన కనకవ్వకు చిన్నప్పట్నుంచీ పాటలంటే మహాఇష్టం. అక్కడా ఇక్కడా విన్న పాటలను పట్టేసి, తానూ కూనిరాగాలు తీసేది. ఈ మధ్య ఇరుగూ పొరుగూ ఆమె పాడుకుంటున్నప్పుడు విడియో తీసి ఆ పాటల్ని టిక్ టాక్ లో వదిలారు. అంతే ... కనకవ్వ లైఫే మారిపోయింది. మిక్ టీవీ జానపద గీతాల ఆడిషన్ లో పాడింది. ఆమె గొంతు విని అందరూ పడిపోయారు. ఆ తరువాత “గిన్నే రామా గిన్నే రామా” అన్న పాటను రికార్డు చేసింది. అంతే... ఆమె వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకే వెళ్తోంది.

ఇప్పుడు కనకవ్వ రికార్డింగులలో బిజీ బిజీగా ఉంది. రికార్డింగుల మధ్యలోనే భర్తతో కలిసి ఎకరం పొలాన్ని సాగుచేసుకుంటోంది. సీజనల్ గా పళ్లను అమ్ముకుంటోంది. సోషల్ మీడియా పుణ్యమా అని రేణు మండల్ లా ఇప్పుడు కనకవ్వ కూడా ఒక సెలబ్రిటీయే.!

Next Story