ఫ్లై ఓవర్‌పై 40 కిలోమీటర్ల వేగం మించితే రూ.1135 జరిమానా

By సుభాష్  Published on  12 March 2020 2:43 PM GMT
ఫ్లై ఓవర్‌పై 40 కిలోమీటర్ల వేగం మించితే రూ.1135 జరిమానా

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్‌ సమస్య గురించి పెద్దగా చెప్పనక్కరలేదు. నగరంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించేందుకు స్ట్రాటజిక్‌రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ (ఎస్‌ఆర్‌డీపీ) చేపట్టింది. ఐటీజోన్‌లోని ట్రాఫిక్‌ నియంత్రణకు నాలుగు సంవత్సరాల్లో అనేక ప్రాజెక్టులు చేపట్టారు. అందులో ముఖ్యమైనది గచ్చిబౌలి సైబరాబాద్‌ కమిషనరేట్‌ సమీపంలోని బయడైవర్సిటీ జంక్షన్‌ ఫ్లై ఓవర్‌. దీనిని రూ. 45 కోట్లతో 990 మీటర్ల పొడవుతో యూనీ డైరెక్షన్‌లో నిర్మించారు.

గత సంవత్సరం పలు ప్రమాదాలు జరగడంతో ప్లై ఓవర్‌ మూతపడిపోయింది. దీంతో ప్రమాదాల నివారణకై అనేక చర్యలు చేపట్టిన అనంతరం ఇటీవల తిరిగి ప్రారంభమైంది. రోడ్‌ సేఫ్టి నిపుణులతో, ఎస్‌ఆర్‌డీఏ అధికారుల సూచనలతో దాదాపు 60 లక్షలతో చర్యలు తీసుకున్నారు. ఇక అన్ని చర్యలతో ఫ్లై ఓవర్‌పై రాకపోకలు కొనసాగుతున్నాయి. తిరిగి ప్రారంభమైన తర్వాత రెండు నెలలుగా ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. ఇక ఫ్లై ఓవర్‌పై ఎస్‌ఆర్‌డీపీ అధికారులు రక్షణ చర్యలు చేపడితే, ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక నిబంధనలు ఏర్పాటు చేసి వాహనాలు వేగంగా ప్రయాణించకుండా చర్యలు చేపడుతున్నారు. ఫ్లై ఓవర్‌పై గంటకు 40 కిలోమీటర్ల వేగం మించకుండా ఆంక్షలు విధించారు.

ఫ్లై ఓవర్‌పై ఆరు చోట్ల స్పీడ్‌గన్‌ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. స్పీడ్‌ నిబంధనలు పాటించకుండా వెళ్లేవారికి రూ. 1135 జరిమానా విధిస్తున్నారు. ఇలా కట్టడి చేయడం వల్ల వాహనాల స్పీడ్‌ చాలా మట్టుకు తగ్గింది. ఈ ఫ్లై ఓవర్‌పై మూడు లైన్లుగా విభజించారు. ఒక లైన్‌లో ద్విచక్ర వాహనాలు, మిగిలిన రెండు లైన్లలో కార్లు, ఇతర వాహనాలు వెళ్లేలా అధికారులు చర్యలు చేపట్టారు.

Next Story