వరంగల్ ఎందుకు మునిగింది? పాపం ఎవరిది?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Aug 2020 6:11 AM GMT
వరంగల్ ఎందుకు మునిగింది? పాపం ఎవరిది?

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరం ఏమైనా ఉందంటే అది వరంగల్ మాత్రమే. హైదరాబాద్ మాదిరే వరంగల్ సైతం జంట నగరాలే. వరంగల్.. హన్మకొండ పేరుతో చెట్టాపట్టాలేసుకున్న ఈ నగరం.. తాజాగా కురిసిన భారీ వర్షాలకు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. నగరం మొత్తం జలమయం కావటమే కాదు.. వేలాది మంది ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చరిత్రలో ఇంతకు ముందెప్పుడు ఎదురుకాని పరిస్థితి తాజా వర్షాల కారణంగా చోటు చేసుకుంది? మరి.. దీనికి కారణం భారీ వర్షాలు మాత్రమేనా? మరే కారణం లేదా? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేస్తే.. అసలు వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి.

వరంగల్ లో నెలకొన్న దారుణ పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలియనివి కావు. ఎందుకంటే.. దాదాపు ఐదేళ్లకు ముందు అంటే.. 2015 జనవరి పదకొండున వరంగల్ కు వచ్చిన ఆయన.. అక్కడి బస్తీ వాసులను ఉద్దేశించి కీలక వ్యాఖ్య చేశారు. కేసీఆర్ మాటల్లోనే చెప్పాలంటే.. ‘‘వానొస్తే నడుములబట్టి నీళ్ళొచ్చి, గిన్నెలు నెత్తినబెట్టుకుని.. గడ్డకు పోయి, వండుకుని తిని.. నీళ్ళు గుంజినంక ఇంటికస్తున్నరు. వరంగల్‌లో 80 కాలనీల్లో ఇదే పరిస్థితి. తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత ఇదే పెద్ద నగరం. మరి ఇట్లుంటే ఎట్లా..? వరంగల్‌ అంటే అద్దం లెక్కనుండాలే. మీరంతా సహకరిస్తే.. రెండుమూడేళ్లలో ఈ పరిస్థితిని మార్చేస్తా’’ అని పేర్కొన్నారు.

ఈ మాటల్ని చూసినప్పుడు అర్థమయ్యేదేమంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు వరంగల్ సమస్య గురించి అవగాహన ఉండేదనేగా?మరి.. గడిచిన ఐదేళ్లుగా ఆయనేం చేయలేదు ఎందుకు? అన్నది ప్రశ్న. ఇదిలా ఉంటే.. భారీగా కురిసిన వర్షాలతో వరంగల్ లోని చాలా ప్రాంతాల్లో నీళ్లు ఇళ్లల్లోకి చేరటమే కాదు.. ప్రజలు మిద్దెలకెక్కి సాయం కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి. దీనంతటికి కారణం చెప్పాల్సి వస్తే చరిత్రలోకి కాస్త తొంగి చూడాలి. వరంగల్ నగర పరిధిలోని రెవెన్యూ రికార్డుల ప్రకారం 248 చెరువులు ఉండాలి. వాటిల్లో ఇప్పుడు 55 చెరువులు మాయం అయ్యాయి. అధికారికంగా చెప్పే లెక్క ఇలా ఉంటే.. అనధికారికంగా ఈ లెక్క మరింత ఎక్కువని చెబుతున్నారు.

చెరువు ప్రాంతాల్ని కబ్జా చేసిన రాజకీయ నేతలు.. ఆ ప్రాంతాల్లో అపార్ట్ మెంట్ల నిర్మాణాన్ని చేపట్టటం.. వాటికి అధికారులు పర్మిషన్లు ఇవ్వటం లాంటి వాటితో.. అక్రమనిర్మాణాలు భారీగా పెరిగాయి. నగరం కాంక్రీట్ జంగిల్ లా మారి.. అక్రమ నిర్మాణాలు.. నీరు తనంతట తాను వెళ్లే మార్గాలు మూసుకుపోయాయి. దీంతో.. తాజా దుస్థితి నెలకొంది.

అంతేకాదు.. వరంగల్ నగర మాస్టర్ ప్లాన్ లెక్క ఇంకా తేల్లేదు. ఒకప్పుడు వరంగల్ లో విశాలంగా ఉన్న నాలాలు కబ్జాల కారణంగా పిల్ల కాలువల్ని తలపిస్తున్నాయి. హన్మకొండలోని నయిం నగర్ ప్రాంతంలోని రెండు బడా విద్యా సంస్థలు నాలాల్ని ఆక్రమించి భారీ భవనాల్ని నిర్మించాయని అధికారులే చెబుతున్నారు. మరి.. చర్యలు తీసుకోవచ్చుగా? అని ప్రశ్నిస్తే సమాధానం రాని పరిస్థితి. పాలకుల హామీలు అమల్లోకి రాకపోవటం.. ఇష్టం వచ్చినట్లుగా సాగుతున్న అక్రమనిర్మాణాల్ని అడ్డుకోవటంలో ప్రభుత్వం విఫలం కావటం ఈ రోజు ఇలాంటి పరిస్థితి కారణంగా చెప్పక తప్పదు.

Next Story