చంద్రబాబు నివాసానికి నోటీసులు

By సుభాష్  Published on  13 Oct 2020 12:32 PM GMT
చంద్రబాబు నివాసానికి నోటీసులు

ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజీకి ప్రస్తుతం రెండున్నర లక్షల క్యూసెక్కుల వరద ప్రవహం ఉండగా, అది ఆరు లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణా నది కరకట్ట లోపల వైపు ఉన్న 36 అక్రమ కట్టడాలకు వరద ముప్పు పొంచి ఉంది. దీంతో అధికారులు వారికి వరద ప్రమాద నోటీసులు జారీ చేశారు. కరకట్ట లోపల వైపు ఉన్నభవనాలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని నోటీసులలో పేర్కొన్నారు. అయితే కరకట్ట లోపల ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్‌ హౌస్‌లో నివాసం ఉంటున్నారు. ఈ సందర్భంగా అధికారులు ఆయన నివాసానికి నోటీసులు అందజేశారు. ఏ క్షణంలోనైనా ఇళ్లల్లోకి నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తం చేశారు.

చంద్రబాబు ఇంటితో సహా 36 ఇళ్లకు నోటీసులు

తాడేపల్లి మండలం పట్టణ పరిధిలో కృష్ణానది వరద నీటి ముంపునకు గురయ్యే అన్ని ఇళ్లకు అధికారులు నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. చంద్రబాబు ఇంటితో సహా మరో 36 ఇళ్లకు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తూ నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. కరకట్ట నిర్మాణాలను ఖాళీ చేయాల్సిందేనని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు నోటీసులలో పేర్కొన్నారు. కాగా, కృష్ణా నదికి వరద అంతకంతకు పెరిగిపోతోంది. ఏక్షణంలోనైనా వరద నీరు ఇంట్లోకి రావచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.

కాగా, కృష్ణానది కరకట్ట మీద ఉన్నలింగమనేని గెస్ట్‌ హౌస్‌లో చంద్రబాబు నివాసం ఉండటంపై గతంలో వివాదాలు తలెత్తాయి. అది అక్రమ కట్టడమని, దానిని కూల్చేస్తామని అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. అయితే దీనిపై ఇంటి యజమాని లింగమనేని రమేష్‌ హైకోర్టును ఆశ్రయించారు.

Next Story