కరోనా వేళ.. భారీ డిమాండ్.. గంటకు రూ.4లక్షలు!
By సుభాష్ Published on 29 Aug 2020 2:43 PM ISTఎక్కడికైనా వెళ్లాలంటే క్యాబ్ లేదంటే సొంత కారు. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే బస్సు.. రైలు.. ఇలాంటి సౌకర్యాలు ఎన్నో ఉండేవి. మారిన కాలంతోపాటు.. చుట్టూ చోటు చేసుకున్న పరిణామాలతో రవాణా సాధనాలు పరిమితంగా మారిపోయాయి. ఒకప్పుడు పెద్ద నగరాల నుంచి ఇంకెక్కడికైనా వెళ్లాలంటే పెద్ద ఎత్తున విమాన సౌకర్యాలు ఉండేవి. ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. కరోనా నేపథ్యంలో ప్రయాణ సాధనాలు పరిమితంగా మారటం.. అవి కూడా ఎంత మేర సురక్షితం అన్న సందేహం పలువురికి కలుగుతోంది.
సామాన్యుల విషయంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. వ్యాపార ప్రముఖులు.. కార్పొరేట్ సీఈవోలు.. సెలబ్రిటీలు.. రాజకీయనేతల ప్రయాణ అవసరాల మాటేమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. గతంలో చాలా అరుదుగా మాత్రమే వినియోగించే ప్రైవేట్ విమానాల డిమాండ్ ఇప్పుడు భారీగా పెరిగినట్లు చెబుతున్నారు. దేశంలోని బడా పారిశ్రామికవేత్తలు.. అత్యంత సంపన్నులతో పాటు.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ ప్రయాణ అవసరాల కోసం ప్రైవేట్ జెట్లను విరివిరిగా వినియోగిస్తున్నారు.
విమాన సౌకర్యాలు తక్కువగా ఉండటం.. రాత్రికి రాత్రి మారే నిర్ణయాలతో ప్రయాణాల మీద ప్రభావం పడటంతో పాటు.. రిస్కు అంతో ఇంతో ఉంటుందన్న ఆలోచనతో ప్రైవేటు విమానాల వైపే మొగ్గు చూపుతున్నారు. కరోనాకు ముందు దేశీయంగా ప్రైవేటు జెట్లకు 30 నుంచి 40 రిక్వెస్టుల వస్తుంటే.. ఇప్పుడు అందుకు భిన్నంగా పెద్ద ఎత్తున రిక్వెస్టు వస్తున్నట్లు చెబుతున్నారు. సాధారణం కంటే ఎక్కువగా దాదాపు తొమ్మిది రెట్ల డిమాండ్ పెరిగింది.
దీంతో.. ఈ రంగంలో ధరలు భారీగా పెరిగిపోయినట్లు చెబుతున్నారు. వ్యక్తిగత అవసరాలతో పాటు.. వైద్య సేవలతో పాటు.. వ్యాపార కార్యకలాపాల కోసం ప్రైవేటు విమానాల్ని విరివిగా వాడుతున్నారు. పెరిగిన డిమాండ్ కు తగ్గట్లే.. ప్రైవేట్ విమానాల అద్దె బాగా పెరిగింది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం గంటకు రూ.85 వేల నుంచి రూ.4లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఛార్జీకి జీఎస్టీతో పాటు ఎయిర్ పోర్టు ఛార్జీలు లాంటివి అదనంగా ఉంటాయని చెబుతున్నారు. వన్ వే ట్రిప్ అయితే.. దించిన తర్వాత తిరిగివెళ్లేందుకు అవసరమయ్యే ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది.