ఫ్లెక్సీ పంచ్.. రాబోయే రోజుల్లో ఇదో ట్రెండ్ కావటం పక్కా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Aug 2020 2:06 AM GMT
ఫ్లెక్సీ పంచ్.. రాబోయే రోజుల్లో ఇదో ట్రెండ్ కావటం పక్కా

చాలా మర్యాదగా.. లాగి పెట్టి ఒక్కటి పీకినట్లుగా చేయటం సాధ్యమా? అంటే కాదనే చెబుతారంతా. కానీ.. బుర్రకు కాస్త పని చెబితే అదేమీ కష్టం కాదన్న విషయం తాజా ఉదంతాన్ని చూస్తే.. ఇట్టే అర్థం కాక మానదు. ఒళ్లు మండే రీతిలో ప్రజాప్రతినిధుల పనితీరు ఉన్నా.. ఒక్క మాట అనటం కష్టమే. కానీ.. అందుకు భిన్నంగా సమయస్ఫూర్తితో ఒక నేత విసిరిన ఫ్లెక్సీ పంచ్ కు సదరు ఎమ్మెల్యేకు దిమ్మ తిరిగిపోవటమే కాదు.. రాబోయే రోజుల్లో ఇదో ట్రెండ్ గా మారినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు.

నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ ఇప్పుడు పట్టణంలోనే కాదు.. తెలంగాణ రాష్ట్రంలోనూ అందరి నోట నానుతోంది. సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లో హల్ చల్ చేస్తున్న పరిస్థితి. ఇంతకీ.. సదరు ఫ్లెక్సీలో విషయం ఏమంటే.. ఆర్మూరు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఒక కొత్త కారు కొన్నారు. దాని విలువ దగ్గర దగ్గర రూ.3కోట్ల వరకు ఉంటుందన్న మాట బలంగా వినిపిస్తోంది.

ఎమ్మెల్యేగారి ఖరీదైన కారు వ్యవహారాన్ని ప్రపంచానికి చాటి చెప్పటంతో పాటు.. అయ్యగారి హయాంలో పట్టణంలోని రోడ్లు ఎంత దారుణంగా మారాయన్న విషయాన్ని విభిన్నంగా చెప్పే ప్రయత్నం చేశారు నిజామాబాద్ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మైలారం బాబు. ఇందుకోసం ఆయన వినూత్న పద్దతిని ఎంచుకున్నారు. వైఫల్యాల మీద అదే పనిగా విరుచుకుపడే పాతపద్దతికి చెక్ పెట్టి.. కొత్త తరహాలో పంచ్ వేశారు. ఇందుకు ఫ్లెక్సీని ఒక ఆయుధంగా వాడుకున్నారు.

ఇటీవల రూ.3కోట్ల విలువైన ఖరీదైన కారు కొన్న మా ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డికి శుభాకాంక్షలు. ఆర్మూరు ప్రజల కోసం కాకున్నా.. తన ఖరీదైన కారు కోసమైనా రోడ్లు వేయించాలన్న విన్నపాన్ని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. సదరు ఫ్లెక్సీలో ఎమ్మెల్యే కారు ఫోటోను.. మరోవైపు ఆర్మూరు - మామిడిపల్లి రైల్వే గేటు వద్ద పూర్తిగా ధ్వంసమైన రోడ్డు ఫోటోను అందులో వేయించారు.

దీంతో.. ఒక్క దెబ్బ కు రెండు పిట్టలన్న సామెతకు భిన్నంగా మూడు పిట్టలన్న రీతిలో తన టాలెంట్ ను ప్రదర్శించారు సదరు ఎమ్మార్పీఎస్ నాయకుడు. ఎమ్మెల్యేగారు ఎంత సంపన్నులన్న విషయాన్ని రూ.3కోట్ల కారుపేరుతో చెప్పేయటం.. రోడ్డుకు.. ఎమ్మెల్యే కారుకు లింకు పెట్టటం.. ఇంత టాలెంట్ ఎవరి సొంతమన్న ప్రస్తావన వచ్చినంతనే.. అందరికి అర్థమయ్యేలా తన ఫోటోను.. పేరును ప్రకటించుకోవటం ద్వారా తానేమిటన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.

Next Story