ఐదు రూపాయల డాక్టర్ ఇక లేరు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Aug 2020 7:55 AM GMT
ఐదు రూపాయల డాక్టర్ ఇక లేరు..!

విజయ్ 'అదిరింది' సినిమా చూశారు కదా..! అందులో అయిదు రూపాయల డాక్టర్ క్యారెక్టర్ లో కనిపిస్తాడు హీరో విజయ్. ఆ క్యారెక్టర్ కు ప్రేరణ మరెవరో కాదు 'డాక్టర్ వి. తిరువేంగడం'. 70 సంవత్సరాల వయసులో ఆయన మరణించారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణం ఉత్తర చెన్నై వాసులను విషాదంలోకి నెట్టేసింది.

వ్యసరపాడి ప్రాంతానికి చెందిన ఈయన 5 రూపాయల డాక్టర్ గా బాగా పేరు సంపాదించుకున్నారు. దాదాపు 30 సంవత్సరాల పాటూ ఆయన సేవలను అందించారు.

1973 నుండి ఆయన అయిదు రూపాయలు తీసుకునే వైద్యాన్ని అందించేవాడు. ఈ మధ్య కాలంలో ఆయన 50 రూపాయలు చేశారు. ఆయన హస్తవాసి కూడా మంచిది అని పేరు రావడం.. మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు వెళితే వేలల్లో, లక్షల్లో ఆసుపత్రి ఫీజులను వసూలు చేస్తుండడంతో ఆయన దగ్గరకే రోగులు ఎక్కువగా వెళ్లే వారు. ఆయన ఎప్పుడు కూడా సెలవు తీసుకోలేదు. మూడు దశాబ్దాలలో ఆయన ఈ ఏడాది మార్చి నెలలో కోవిద్-19 కారణంగా ఆసుపత్రిని మూసేశారు.

'ఆయన వయసు రీత్యా కూడా పెద్దగా బ్రేక్ తీసుకునేవారు కాదు.. రోజు మొత్తం రోగులను చూస్తూ ఉండేవారు. తక్కువ సమయమే నిద్రపోయేవారు' అని ఆయన కుమార్తె డాక్టర్ ప్రీతి చెప్పుకొచ్చారు. పేషేంట్లకు తన ఫోన్ నెంబర్ ఇచ్చేసేవారు, ఎలాంటి సమయంలో అయినా కాల్ చేయమని చెప్పేవారు. ఒకవేళ పేషెంట్స్ ఆసుపత్రికి రాలేకపోతున్నామని చెబితే.. దగ్గర ఉన్న మందుషాపులకు వెళ్ళమని చెప్పి ఏయే మందులు ఇవ్వాలో మెడికల్ షాప్ వాళ్లకు చెప్పే వారట. తన తండ్రికి మొదట రోగుల సమస్యలు తీర్చడం.. ఆ తర్వాత కుటుంబం గురించి పట్టించుకునేవారని తెలిపారు ప్రీతి. ఇంట్లో ఏవైనా ఫంక్షన్లు జరిగినప్పుడు అలా హాజరై.. అలా క్లినిక్ కు వెళ్ళిపోయేవారు. తన తండ్రి గవర్నమెంట్ స్కూల్ లో చదువుకున్నారు.. గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నారు.. అందుకే సమాజానికి కూడా తిరిగి చేయాలని అనుకున్నారు. అందుకే ఆసుపత్రిలో అతి తక్కువ డబ్బుకే చికిత్స అందిస్తూ ఉండేవారని ప్రీతి తెలిపింది.

ఎవరైనా ఎక్కువ డబ్బులు ఇస్తూ ఉన్నా కూడా అది తీసుకునేవారు కాదట.. సున్నితంగా తిరస్కరిస్తూ ఉండేవారు. ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్న రోగుల దగ్గర నుండి డబ్బులు తీసుకోవడం కూడా ఆయనకు నచ్చేది కాదు. విజయ్ మెర్సల్(అదిరింది) సినిమా ద్వారా ఆయన మరింత పాపులర్ అయ్యారు.

ఆయన చనిపోవడం కుటుంబానికి మాత్రమే కాదు.. ఎంతో మందికి విషాదాన్ని నింపింది. ఆయన చనిపోయారని తెలియగానే కడసారి చూడడానికి ఎంతో మంది వచ్చారు. తన తండ్రి చనిపోవడంతో క్లినిక్ మూత పడదని.. నేను, నా తమ్ముడు డాక్టర్ కావడంతో ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తామని అన్నారు ప్రీతి.

Next Story