దూడను కాపాడడానికి బావిలోకి దిగిన ఐదుగురు.. ఆ తర్వాత ఏమైందంటే..!

By సుభాష్  Published on  9 Sep 2020 9:23 AM GMT
దూడను కాపాడడానికి బావిలోకి దిగిన ఐదుగురు.. ఆ తర్వాత ఏమైందంటే..!

దూడను కాపాడడం కోసం బావిలోకి దిగిన అయిదు మంది చనిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. గోండా జిల్లాలోని కొత్వాలీ ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన ఐదుగురిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు కావడంతో ఆ ప్రాంతంలో రోదనలు మిన్నంటాయి.

దూడ ఓ బావిలో పడిపోవడాన్ని అక్కడ ఉన్న వాళ్ళు గమనించారు. ఆ దూడను రక్షించాలని మొదట ఇద్దరు బావిలోకి దిగారు. అలా దిగిన వారికి క్షణాల్లో ఊపిరి ఆడలేదు. ఇంతలో పైన ఉన్న వాళ్లు మరో ముగ్గురు దిగారు. వారికి కూడా ఊపిరి అందక స్పృహ తప్పి పడిపోయారు. దీంతో అగ్నిమాపక బృందానికి సమాచారం అందించారు. వారు బయటకు తీసుకుని వచ్చారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయారని వైద్యులు ధృవీకరించారు. విషపూరితమైన మీథేన్ వాయువును పీల్చడం వలన వారు చనిపోయారని గుర్తించారు. బావిలో పడిన దూడకు మాత్రం ఏమీ అవ్వలేదు. ప్రాణాలతో ఉంది. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతి చెందిన ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు.

చనిపోయిన వారిని వైభవ్(18), దినేష్ అలియాస్ చోటు(30), రవిశంకర్ అలియాస్ రింకు(36), విష్ణు దయాళ్(35) మహారాజ్ గంజ్ ప్రాంతానికి చెందిన వారుగా.. మరొక వ్యక్తి మన్ను సైని(35) తార్హర్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. దినేష్, రవి శంకర్ లు సోదరులు కాగా.. విష్ణు, వైభవ్ లు సొంత బంధువులు. మన్ను ఇతర ప్రాంతం నుండి వచ్చిన వ్యక్తి వారిని కాపాడడానికి ప్రయత్నించి ప్రాణాలను కోల్పోయాడు. మీథేన్ వాయువును పీల్చడం వలనే వారు చనిపోయారని ధృవీకరించారు.

Next Story
Share it