ఎట్ట‌కేల‌కు స్వస్థలాలకు చేరుకున్న మత్స్యకారులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 May 2020 7:14 AM GMT
ఎట్ట‌కేల‌కు స్వస్థలాలకు చేరుకున్న మత్స్యకారులు

గుజరాత్‌లో చిక్కుకున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ మత్స్యకారులను.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో ఎట్టకేలకు వారి వారి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. శుక్రవారం రాత్రి 12 బస్సుల్లో 890 మంది రాగా.. మిగిలిన 3,178 మంది శనివారం వారి స్వగ్రామాలకు చేరుకుంటారు. లాక్‌డౌన్‌తో రాష్ట్రానికి చెందిన 4,068 మంది మత్స్యకారులు గుజరాత్‌లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.

వీరిలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు 2,911 మంది ఉండగా.. విజయనగరం జిల్లాకు చెందిన వారు 711, విశాఖపట్నం జిల్లాకు చెందినవారు 418, తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు 13 మంది, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారు ఒకరు, ఒడిశాలో ఉంటున్న మరో 14 మంది ఉన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో గుజరాత్‌లో నిలువ నీడ లేక, తినడానికి తిండి లేక 37 రోజుల పాటు వీరంతా అష్టకష్టాలు పడ్డారు.

దీంతో మత్స్యకారుల కుటుంబసభ్యుల వినతి మేరకు వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీతో మాట్లాడారు. మత్స్యకారులను రాష్ట్రానికి తరలించడానికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులకు రాష్ట్రానికి తీసుకురావడానికి రూ.3 కోట్లు విడుదల చేయించారు. దీంతో వారు నేడు వారి ఇళ్ల‌కు చేర‌నున్నారు.

Next Story
Share it