తొలి ముస్లిం మహిళా మావటి
By మధుసూదనరావు రామదుర్గం Published on 26 Aug 2020 6:47 AM GMTమహిళలు అన్ని రంగాల్లో మగవాళ్లకు దీటుగా ఉంటున్నారు అనేది కేవలం మాట వరసకు కాదని షబ్నా లాంటి మహిళల్ని చూస్తే తెలుస్తుంది. జీవితంలో అన్నీ కుదిరి.. దుబాయ్‌లో మంచి ఉద్యోగం చేసుకుంటున్న షబ్నాకు ఏనుగులతో జట్టు కట్టాలని కోరిక పుట్టింది. అయితే ఇదేదో రాత్రికి రాత్రే మనసులో కలిగిన ఆలోచనైతే కాదు. ఏదైనా గొప్ప లక్ష్యాన్ని సాధించాలంటే మనం సాధారణంగా కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అంటుంటాం. షబ్నా కూడా అలాంటి ఉన్నత లక్ష్యం కోసమే ఉద్యోగాన్ని వదిలేసుకుంది. ఎలాగైనా ఏనుగుల్ని మచ్చిక చేసుకుని మావటీగా రాణించాలని అనుకుంది.
మావటీలు అననగానే మనకు ఇది మగవాళ్లు చేసే పని అనిపిస్తుంది. కేరళ ఏనుగుల స్థావరమే అయినా అక్కడ మావటీలందరూ మగవాళ్ళే! ఏనుగులను మచ్చిక చేసుకోడానికి అరుదుగా ఒకరిద్దరు మహిళా మావటీలున్నా...షబ్నా మాత్రం తొలి ముస్లిం మహిళా మావటీగా రికార్డు సృష్టించింది. ఈ ఏడాది మొదట్లో షబ్నా దుబాయ్ నుంచి కేరళకు వచ్చేసింది. కేవలం ఏనుగుల గురించి శిక్షణ తీసుకోడానికే! అందుకే షబ్నా ఉన్నట్టుండి వార్తల్లో వ్యక్తి అయింది. చాలా మంది షబ్నా లక్ష్యం గురించి చర్చించుకున్నారు.
అయితే దేశంలో తొలి మహిళా మావటీ ఎవరంటే వెంటనే పార్బతి పేరు చెబుతారు. గౌహతికి చెందిన పార్బతి జమిందార్ కుటుంబంలో పుట్టింది. తన తండ్రికి మూగ జంతువులంటే ఎక్కడలేని అభిమానం. అతనికి ఏనుగులను మచ్చిక చేసుకోవడంలో ప్రావీణ్యం ఉంది. ఆ వారసత్వ గుణం అబ్బిందేమో పార్బతి తన 14వ ఏట నుంచే ఏనుగులను అదుపు చేయడం నేర్చుకుంది. జమీందారు కూతురిగా ఆమె ఎన్ని రాజభోగాలైనా అనుభవించవచ్చు. కానీ అడవుల్లో ఎండలో ఎండి, వానకు తడిసి, చలికి వణికి ఏనుగులను మచ్చిక చేసుకుంది. పార్బతి గౌహతిలో డిగ్రీ చేసింది. బ్యాంకు అధికారిని పెళ్ళి చేసుకుని పిల్లల తల్లిగా ఇంటికే పరిమితమైనా...అడవులపై ఆమె మమకారం ఏమాత్రం తగ్గలేదు. వీలు దొరికినపుడల్లా పిల్లలతో కలిసి అడవులకు వెళ్ళేది. చిన్నప్పుడు ఆమె ఏనుగుపై కూర్చొని షికారు చేస్తుంటే అందరూ ఆమెను ఏనుగుల రాజకుమారి అని పిలిచేవారు.
సులైమాన్ షబ్నా స్వంత ఊరు కేరళలోని కొజివీడ్ సమీపాన ఉన్న కడలుండి. దుబాయ్‌లో వైద్య సిబ్బందిగా ఉన్న షబ్నా ఏనుగులపై ఓ పుస్తకం రాయాలనుకుంది. అనుకున్నదే తడవు వెంటనే ఏనుగులకు సంబంధించిన పుస్తకాలను తెప్పించుకుని చదవడం మొదలెట్టింది. పుస్తకం విజ్ఞానమిస్తుందన్నది వాస్తవమే అయినా, కేవలం పుస్తక పరిజ్ఞానంతోనే తన లక్ష్యాన్ని సాధించడం కష్టమని షబ్నాకు అర్థమైంది. అందుకే వెంటనే కేరళకెళ్ళి అక్కడ ఏనుగుల మధ్య తిరగగలిగితే మరింత అదనపు లేదా అసలు సమాచారం లభిస్తుందని వెళ్ళింది. అంతే కాదు మావటీగా తర్ఫీదు కూడా తీసుకోవాలని బలంగా సంకల్పించుకుంది. అనుకున్నంత సులువు కాదుగా.. అసలే ఏనుగులతో సహవాసం. కానీ షబ్నా దృఢ నిశ్చయం ముందు ఆ భయం చిన్నబోయింది.
షబ్నా నిర్ణయం ఎవరికి ఎలా అనిపించినా కుటుంబ సభ్యులకు మాత్రం కొత్తగా అనిపించలేదు. కారణం ఆమె తాతకు ‘గ్రేట్ మలబార్ సర్కస్’ పేరుతో ఓ సర్కస్ కంపెనీ ఉండేది. ఇది కేరళలో తొలి సర్కస్. అయితే ఓ సారి సర్కస్ ప్రదర్శనలో షబ్నా చిన్నాన్నను పులి చంపేసింది. చెట్టంత కొడుకు కడతేరిపోవడంతో మనసు విరిగిన ఆయన సర్కస్ కంపెనీని అమ్మేశాడు. ఆ కుటుంబానికి మూగజీవాలతో అనుబంధం ఉంది కాబట్టే.. షబ్నా మావటీ విద్య నేర్చుకుంటానంటే ఆమె తండ్రి ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. ముస్లిం మతపెద్దలు కొందరు ఈ సందర్భంలో అమ్మాయికి ఇది అంత అవసరమా అని కూడా ప్రశ్నించారు. వారికి తండ్రి నచ్చజెప్పడంతో మావటీ విద్య నేర్చుకోడానికి పచ్చజెండా ఊపారు.
మావటీ విద్య అభ్యసించేందుకు ప్రత్యేక స్కూళ్ళు ఉన్నాయి. పాలక్కాడ్‌లోని ఒట్టపాలెంటలో మానిశ్శేరి హరిదాస్ మావటీల గురువు. అతని వద్ద మూడు ఏనుగులున్నాయి. ఉత్సవాలక వాటిని అద్దెకిస్తుంటాడు. హరిదాస్ వద్దకు షబ్నా వెళ్ళి తనకు మావటీ విద్య నేర్పించాల్సిందిగా అర్థించింది. మహిళ అందులోనూ ముస్లిం మహిళా ఇలాంటి విద్య నేర్పించాల్సిందిగా అడగటం ఇదే మొదలు. మొదట్లో కాస్త తటపటాయించినా.. సరేలే చూద్దాం అన్నాడు. అలాగని ఆమెను నిరాశ పరచకుండా తన వద్ద ఉన్న రాజేంద్రన్ అనే ఏనుగును ఆమెకు అప్పగించాడు. మావటీ విద్యను మూడు దశల్లో నేర్పించాడు. అసలే అయిదడుగుల ఎత్తున్న షబ్నా ఏనుగును ఎలా కంట్రోల్ చేస్తుందని హరిదాస్ అనుకున్నా.. ఆమె చాలా చక్కగా రాజేంద్రన్‌ను నియంత్రించగలిగింది. కూర్చోమంటే కూర్చోడం.. వెనక్కు తిరగమంటే తిరగడం, తొండం పైకెత్తమంటే ఎత్తడం లాంటి కమాండ్లను రాజేంద్రన్ గ్రహించగలుగుతున్నాడు.
షబ్నా మావటీ విద్యను అభ్యసిస్తోందని అనోటా ఈనోటా ప్రచారమైంది. కేరళ దేవాలయాల దాకా ఈ సమాచారం వెళ్ళడంతో దేవాలయ ఉత్సవాలకు రాజేంద్రన్‌తోపాటు షబ్నాను పిలవాలని నిర్ణయించు కున్నారు. ఉత్సవాల్లో పోటెత్తిన జనాల మధ్య ఏనుగును నియంత్రించడం చాలా కష్టం ఏమాత్రం అటుఇటు అయినా ప్రాణాలకే ప్రమాదం. అయినా షబ్నా తాను కచ్చితంగా ఆ ఆహ్వానాన్ని స్వీకరిస్తున్నట్లు తెలిపింది.
జీవితంలో మనం చాలా అనుకుంటుంటాం. కానీ కొన్నే జరుగుతాయని మనకూ తెలుసు. కారణం ఏటికి ఎదురీదే తత్వం లేకపోవడమే. షబ్నా మాత్రం అలా కాదు. ఎన్ని విమర్శలు వచ్చినా...బంగారం లాంటి ఉద్యోగం వదులుకుని ఇదేం పని అని చాలామంది అన్నా ఏమాత్రం తొణకలేదు బెణకలేదు. తనకు నచ్చిన పని చేసుకోవడంలో తృప్తి ఉంటుందని నమ్మింది.. అలా నమ్మిన దాన్నే ఆచరించింది. అందుకే ఈనాడు తొలి ముస్లిం మహిళా మావటీగా నిలిచింది.