భారీ పేలుడు.. ఏడుగురు మృతి
By సుభాష్ Published on 6 Feb 2020 5:17 PM IST
ఓ కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ పైప్‌లైన్ లీకై పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన గురువారం ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. మృతుల్లో ముగ్గురు పిల్లలున్నట్లు తెలుస్తోంది. పేలుడు ఘటనను తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ కుమార్ మాట్లాడుతూ.. బిస్వాన్ ప్రాంతంలో ఉన్న కెమికల్‌లో గ్యాస్‌పైప్ లీకై భారీ పేలుడు సంభవించిందని, పేలుడు జరిగిన ప్రాంతంలో కార్పెట్ తయారీ కంపెనీ ఉండటంతో మంటలు మరింతగా వ్యాపించాయన్నారు.
ఈ కార్పెట్ కంపెనీని ఆనుకుని ఏడుగురు నిద్రిస్తున్నారని, మంటల ధాటికి వారు మృతి చెందినట్లు చెప్పారు. ఘటన స్థలానికి చేరుకున్నపోలీసులు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. అయితే మృతదేహాలకు బయటకు తీసేందుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం అందించనున్నట్లు సీఎం యోగి తెలిపారు.